Cloud Burst In Himachal Pradesh 2023 : హిమాచల్ ప్రదేశ్‌లో వరదల ధాటికి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు కొట్టుకుపోయారు. సోలాన్ జిల్లాలోని జాడోన్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. మరో ఐదుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. వరదల ధాటికి రెండు ఇళ్లు, ఓ గోశాల పూర్తిగా కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ.. దాని పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేసింది. వాటిని ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. ఆగస్టు 14 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని.. విద్యాశాఖ కార్యదర్శికి ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిషితంగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి, హోం శాఖ కార్యదర్శికి, జిల్లా కలెక్టర్లకు సూచించారు. రవాణా, విద్యుత్, నీటి సరాఫరాలు సాఫీగా సాగేలా చూడాలని వారిని ఆదేశించారు.
డేంజర్ మార్క్ దాటిన నందాకిని నది..
Mandakini River Uttarakhand :ఉత్తరాఖండ్‌లోని నందాకిని నది డేంజర్ మార్క్‌ను దాటి ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటలకు చమోలీ జిల్లాలోని నందనగర్ ప్రాంతంలో పలు ఇళ్లలోకి అకస్మాత్తుగా నీరు ప్రవేశించింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు ప్రజలు. అనంతరం తమ నివాసాలను ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలను వరద ముంచెత్తిందని అధికారులు తెలిపారు. నందాకిని ఉధృతికి ఓ పాఠశాల ధ్వంసమైందని వారు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో పలు నదులు డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని వారు సూచించారు.