CJI NV Ramana on law course: విద్యార్థులు న్యాయవాద వృత్తిని కేవలం వృత్తిగా చూడాలి తప్పిస్తే దాన్నో వ్యాపారంగా చూడొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. లాభార్జన కోసం ఈ వృత్తిని ఉపయోగించొద్దని హితవు పలికారు. గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థుల నుంచి గొప్ప నాయకులు పుట్టుకు రావడంలేదన్నారు. గురువారం ఇక్కడ జరిగిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (నేషనల్ లా యూనివర్శిటీ) 8వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని కీలకోపన్యాసం చేశారు.
"న్యాయ వృత్తి చాలా గొప్పది. నిరంతరం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకున్న పౌరులు ప్రజాస్వామ్య సమాజానికి గొప్ప ఆస్తి. ఆధునిక ప్రజాస్వామ్యంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని తక్కువ చేయకూడదు. విద్యార్థులు నాయకుల్లా అవతరించాలి. జాతి ఆలోచనలను ప్రభావితం చేసే సంకుచిత, విభజనకారక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు. సాధారణ పాఠశాల, కాలేజీ విద్యకు తోడు చుట్టూ ఉన్న వాతావరణం మా తరానికి ఎన్నో విలువైన విషయాలు నేర్పింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు వృత్తి విద్యా కోర్సులపై పూర్తి నిర్లక్ష్యం నెలకొంది. ముక్కుపచ్చలారని వయసులో చిన్నారుల ప్రతిభ అంతా ఊపిరాడని వాతావరణంలో, జైళ్లను తలపించే గదుల్లో ఆవిరైపోతోంది" అని జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.