CJI NV Ramana Comments: అవినీతి కేసులో దాఖలైన ప్రాథమిక నివేదిక ప్రతిని తనకు ఇవ్వాలంటూ తమిళనాడు మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన మద్రాస్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయనకు ఆ నివేదిక అందకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైనా మండిపడింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టులను వేదికగా చేసుకోనిస్తే ఇలాగే జరుగుతుందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది.
రాజకీయ కక్షసాధింపులకు కోర్టులు వేదికలా..?: సీజేఐ
CJI NV Ramana Comments: రాజకీయ కక్షసాధింపులకు కోర్టులు వేదికగా కాకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. అవినీతి కేసులో దాఖలైన ప్రాథమిక నివేదిక ప్రతిని తనకు ఇవ్వాలంటూ తమిళనాడు మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన మద్రాస్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
వేలుమణిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారణకు స్వీకరించిన హైకోర్టు దానిపై దర్యాప్తు జరిపి, నివేదిక సమర్పించాలని విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాన్ని ఆదేశించింది. ఆ మేరకు దీనిపై ఉన్నత న్యాయస్థానానికి ప్రాథమిక నివేదిక అందింది. దీని ప్రతిని తనకు అందించాలన్న వేలుమణి విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నివేదిక విషయంలో ఉన్నత న్యాయస్థానం ఇలా మాట్లాడటమేంటని సుప్రీం ప్రశ్నించింది. "ఇది సరికాదు. హైకోర్టు నిర్ణయం తప్పు. రేపు మేం కూడా ఇదేరీతిలో ఏదైనా అంశంపై విచారణకు ఆదేశించామనుకోండి. సంబంధిత దర్యాప్తు సంస్థ తన నివేదికను సమర్పించాక.. దాన్ని సీల్డ్ కవర్‌లోనే ఉంచండి.. ప్రభుత్వానికి పంపుతామని మేం చెప్పగలమా" అని పేర్కొంది. ఇది ప్రభుత్వ కక్ష సాధింపేనని తెలిపింది. "వ్యక్తులు వస్తారు.. పోతారు.. ప్రభుత్వాలు మాత్రం కొనసాగుతాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరించాలి" అని పేర్కొంది. వేలుమణి పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.
ఇదీ చదవండి:కర్ణాటకలో సీఎం మార్పు..? అమిత్ షా పర్యటన వెనుక ఆంతర్యం అదేనా?