39th CJs' Meet: న్యాయవ్యవస్థలో ఉన్న వివిధ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు శుక్రవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వం వహిస్తారు. ఇందులో ప్రధానంగా 2016నాటి ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి గురించి సమీక్షిస్తారు. అలాగే ప్రజలకు వేగవంతంగా న్యాయం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, అన్ని రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక/శాశ్వత ప్రధాన న్యాయమూర్తులు పాలుపంచుకుంటారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు 1953లో తొలిసారి ఇలా ప్రధాన న్యాయమూర్తుల సదస్సుకు శ్రీకారం చుట్టగా ఇప్పటివరకు 38 పూర్తయ్యాయి. చివరి సదస్సు 2016లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకుర్ నేతృత్వంలో జరిగింది.
ఐదు అంశాలపై ప్రధాన దృష్టి:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చొరవతో ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరగనున్న ఈ సదస్సులో ప్రధానంగా అయిదు అంశాలపై చర్చించనున్నారు. 1. దేశవ్యాప్తంగా అన్ని కోర్టు సముదాయాల్లో నెట్‌వర్క్, అనుసంధానతను బలోపేతం చేయడం, 2.జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు మానవ వనరులు/సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పన, 3. మౌలికవసతుల కల్పన, భవనాల సామర్థ్యం పెంపు, 4. సంస్థాగత, న్యాయపరమైన సంస్కరణల అమలు, 5. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు అన్న అంశాలు ఉన్నాయి.