China India Border Issue Rahul :దక్షిణాఫ్రికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య బుధవారం జరిగిన సంభాషణపై చైనా వింత వాదన ఎత్తుకుంది. భారత్ కోరిక మేరకే మోదీతో జిన్‌పింగ్ మాట్లాడినట్లు తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. చైనా వాదనను కొట్టిపారేసింది. అదంతా అసత్య ప్రచారమని కుండబద్దలు కొట్టింది.
దీనిపై గురువారం భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వివరణ ఇచ్చారు. బ్రిక్ సమావేశాల సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ కాసేపు మాట్లాడుకున్నారని ఆయన తెలిపారు. తూర్పు లద్ధాఖ్లోని ఎల్ఏసీ వద్ద సరిహద్దు సమస్యలపై భారత్ ఆందోళన చెందిందని వివరించారు. సరిహద్దుల్లో శాంతి అవసరమని భారత్ నొక్కి చెప్పిందన్న వినయ్ క్వాత్రా.. చైనాయే భారత్‌తో దైపాక్షిక చర్చల కోసం అభ్యర్థించిందని పేర్కొన్నారు.
Asaduddin Owaisi Fire On Modi :అయితే చైనా ఆరోపణల ఆధారంగా చేసుకుని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. "మోదీ.. చైనా అధ్యక్షుడితో మాట్లాడాలి అనుకుంటున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి చెప్పారు. మన విదేశాంగ కార్యదర్శి మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. జిన్‌పింగ్ వెంట మోదీ ఎందుకు పడుతున్నారు? చైనా చూపే పరిష్కారాన్ని అంగీకరించాలని ఆర్మీపై ఎందుకు మోదీ ఒత్తిడి తెస్తున్నారు? చైనా దళాలకు మోదీ ఎందుకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు?" అని ఓవైసీ ప్రశ్నించారు. 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. దీనిపై చర్చ జరిపేందుకు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేశారు. చైనా విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ, జిన్‌పింగ్ సంభాషణ వేళ.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
China India Border Issue Rahul Gandhi Comments On Modi : ఈ నేపథ్యంలోనే చైనాతో సరిహద్దు వివాదంలో కేంద్రం వైఖరిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. వేలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినా ప్రధానమంత్రి నిజం చెప్పడం లేదని విమర్శించారు. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సంభాషించుకున్న వేళ.. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.లద్ధాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీశుక్రవారం కార్గిల్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత రాహుల్ లద్ధాఖ్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.
"భారత్‌కు చెందిన వేలాది కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది. చింతించాల్సిన విషయం ఏమిటంటే భారత ప్రధాన మంత్రి విపక్షాలతో జరిగిన సమావేశంలో.. భారత్‌కు చెందిన భూభాగం ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదని తెలిపారు. ఇది పచ్చి అబద్ధం. లద్ధాఖ్‌కు చెందిన ప్రతి వ్యక్తికి తెలుసు. లద్ధాఖ్‌కు చెందిన భూమిని భారత్ నుంచి చైనా ఆక్రమించుకుంది."