కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. అంగన్‌వాడీ టీచర్, సహాయకురాలు ఓ బాలుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంగన్వాడీకి వచ్చిన ఓ బాలుడ్ని టాయిలెట్లో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. బాలుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్‌వాడీ సిబ్బందిని .. విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
అసలేం జరిగిందంటే..కోలార్ జిల్లాలోనిహరోహళ్లిలోని అంగన్వాడీలో టీచర్‌గా సుధ, హెల్పర్‌గా శారద పనిచేస్తున్నారు. అంగన్వాడీకి వచ్చిన ఓ బాలుడు ఇంటికి వచ్చే ముందు టాయిలెట్‌కు వెళ్లాడు. కానీ టీచర్, హెల్పర్ అది గమనించకపోవడం వల్ల టాయిలెట్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే బాలుడి కోసం అతని తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. ఎంతకీ బాలుడు కనిపించలేదు. ఆఖరికి అంగన్‌వాడీ వద్దకు వచ్చి వెతికారు. బాలుడి ఏడుపు వినిపించింది. వెంటనే తలుపు తీసి టాయిలెట్ నుంచి తమ బిడ్డను బయటకు తీశారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.