సవరించిన వ్యాక్సిన్ విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజు రికార్డు స్థాయిలో జరిగిన టీకా పంపిణీ.. ఆ మరుసటి రోజు గణనీయంగా తగ్గింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ''మోదీ ఉంటే.. ఇలాంటి ఆశ్చర్యాలు సాధ్యమేనని ఎద్దేవా చేసిన ఆయన.. బహుశా దీనికి నోబెల్ బహుమతి కూడా ఇస్తారేమో'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందజేసేలా.. సవరించిన మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఆ రోజు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 88 లక్షల మందికి టీకాలు వేశారు. అయితే, మంగళవారం మాత్రం 54లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ గణాంకాలపై చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'మోదీ ఉంటే అద్భుతాలే'
"ఆదివారం కూడబెట్టి.. సోమవారం వ్యాక్సిన్ వేసి.. మంగళవారం తిరిగి ఎప్పటిలాంటి ఇబ్బందుల్లోకి రావడం - వ్యాక్సినేషన్‌లో 'ప్రపంచ రికార్డు' వెనుక రహస్యమిదే. ఈ 'ఫీట్'కు కచ్చితంగా గిన్నిస్‌బుక్‌లో చోటు లభిస్తుందనిపిస్తోంది. ఎవరికి తెలుసు.. బహుశా మోదీ ప్రభుత్వానికి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా ఇవ్వొచ్చు. 'మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే' అనేదాన్ని ఇప్పుడు 'మోదీ ఉంటే అద్భుతాలే' అనాలేమో!" అంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు.
అయితే చిదంబరం ట్వీట్‌కు భాజపా నేత అమిత్ మాలవీయ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వల్లే మంగళవారం టీకా పంపిణీ తగ్గిందని దుయ్యబట్టారు. ఆ రాష్ట్రాలే భారత్ పేరును దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఇకనైనా కేంద్రాన్ని ఎగతాళి చేయడం మాని కాంగ్రెస్, దాని మిత్రపక్ష ప్రభుత్వాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.
ఇదీ చూడండి:వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు- ఒక్కరోజే 86 లక్షల డోసులు