పిల్లులకో కేఫ్- అది ఎక్కడ ఉందంటే? రెస్టారెంట్లో కూర్చుంటే కాళ్ల కింద చేపలు సందడి చేస్తాయని చదివాం. హోటల్లో కూర్చుంటే డాల్ఫిన్లు, సింహాలు వంటివి పక్కకు రావడమూ చూశాం. అయితే.. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని 'మ్యావ్ ది క్యాట్ కేఫ్' రెస్టారెంట్ మాత్రం కాస్త భిన్నమైనది. అక్కడికి వెళ్తే రకరకాల పిల్లులు దర్శనమిస్తాయి. జంతు ప్రేమికులు.. ముఖ్యంగా పిల్లులను ఇష్టపడేవారు ఆ రెస్టారెంట్‌కు వెళ్తే.. అంత త్వరగా బయటకు రాలేరు. తమ రెస్టారెంట్‌కు వస్తే.. ఇష్టమైన పిల్లులతో కాసేపు సదదాగా గడపడమే కాకుండా.. రుచికరమైన ఆహార పదార్థాలను ఆస్వాదించొచ్చు అని అంటున్నాడు నిర్వాహకుడు ఆదిత్య పాండే.
'మ్యావ్ ది క్యాట్ కేఫ్ ఇన్ రాయ్‌పూర్ దేశీ పిల్లుల సంరక్షణతో జర్నీ మొదలు..
రాయ్‌పూర్‌కు చెందిన ఆదిత్య పాండే చిన్ననాటి నుంచే పిల్లుల పట్ల ప్రత్యేక అనుబంధం పెంచుకున్నాడు. రాయ్‌పూర్‌లో సంరక్షణ లేకుండా ఉన్న పిల్లులను చేరదీసేవాడు. ఈ క్రమంలో పిల్లుల అడాప్షన్(దత్తత) కేంద్రం, క్యాట్ హాస్టల్‌ను మొదలు పెట్టాడు. ఈ ఏడాది మార్చిలో 'మ్యావ్ కేఫ్'ను ప్రారంభించాడు. అందులోనే ఇప్పుడు అడాప్షన్ కేంద్రం, క్యాట్ హాస్టల్‌ను నడిపిస్తున్నాడు. ఇప్పటివరకూ 25దేశీయ పిల్లులను వివిధ ప్రదేశాల నుంచి అతని బృందం రక్షించింది. అనారోగ్యంగా ఉన్న పిల్లులకు చికిత్స సైతం అందిస్తారు.
"జపాన్‌లోని టోక్యోలో పిల్లులకు ప్రత్యేకంగా ఓ కేఫ్ ఉందని ఇంటర్నెట్లో చదివా. మనదేశంలో మొట్టమొదటి 'క్యాట్ కేఫ్' ముంబయి(2018)లో ప్రారంభమైంది. రాయ్‌పూర్‌లోనూ అలాంటి ఓ కేఫ్‌ను తెరవాలని నిర్ణయించుకున్నా. మొదట పిల్లుల అడాప్షన్(దత్తత) కేంద్రాన్ని ప్రారంభించా. దీనికి వచ్చిన అనూహ్య స్పందనతో ఓ కేఫ్‌ను ప్రారంభించాలనే ఆలోచన బలపడింది. కేఫ్ ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతం పిల్లుల కోసం ఖర్చు చేస్తున్నా."
-ఆదిత్య పాండే, మ్యావ్ ది క్యాట్ కేఫ్ యజమాని
దత్తత తీసుకోవచ్చు..
'మ్యావ్ కేఫ్' రెస్టారెంట్‌లోని పిల్లులను ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అయితే దత్తత తీసుకునే ముందు పిల్లుల బాగోగులకు సంబంధించి కొన్ని నిబంధనలకు అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే నగరంలోని పిల్లుల ప్రేమికులందరూ ఓ చోట చేరడానికి ఈ రెస్టారెంట్ ఒక వేదిక లాంటింది అంటారు ఆదిత్య పాండే.
'మ్యావ్ ది క్యాట్ కేఫ్ ఇన్ రాయ్‌పూర్ లోపలి దృశ్యం "మన సమాజంలో పిల్లులను అశుభానికి సూచకంగా భావిస్తుంటారు. శునకాలు, ఆవులు వంటి ఇతర జంతువులను ఆదరించినట్లుగా పిల్లులను పట్టించుకోరు. కానీ పిల్లులు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఇంత పెద్ద రాజధానిలో పిల్లులకు ఏమైనా అయితే పట్టించుకునేవారు లేరు. సామాజిక మాధ్యమాల్లో పిల్లుల ప్రేమికులు ఎక్కువే. వాటి వీడియోలు వైరల్ అవుతుంటాయి కూడా. నగరంలోని పిల్లుల ప్రేమికులందరూ ఓ చోట చేరేందుకు ఒక వేదిక ఉంటే బాంగుంటుది అనిపించి దీనిని మొదలుపెట్టా. పిల్లులతో కావాలసినంత సమయం గడపవచ్చు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు."
-ఆదిత్య పాండే, మ్యావ్ ది క్యాట్ కేఫ్
రెస్టారెంట్ లోపలోకి అడుగుపెట్టగానే వినియోగదారులకు పర్షియన్, ఇండియన్ పిల్లులు స్వాగతం పలుకుతాయి. పిల్లులతో రెస్టారెంట్ అనే వినూత్న ఆలోచన నచ్చి.. చాలా మందికి ఇక్కడి వస్తుంటారు. వాటితో కొంత సమయం గడిపి.. వినియోగదారులు తమకు ఇష్టమైన ఆహారం తిని వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్లు భిన్నమైన అనుభూతిని పొందడం వల్లే మళ్లీ మళ్లీ వస్తున్నారని చెబుతున్నాడు ఆదిత్య పాండే. మ్యావ్ కేఫ్' రెస్టారెంట్‌కు వచ్చేవారిలో యువత, పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు.
కస్టమర్లతో సరదాగా ఆడుతున్న పిల్లులు "మా ఇల్లు ఇక్కడికి పక్కనే ఉంది. నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాను. పిల్లులంటే నాకు చాలా ఇష్టం. ప్రశాంత వాతావరణం ఉంటుదిక్కడ. ఇక ఆహారం కూడా రుచిగా ఉంటుంది."
-రశీమ, కస్టమర్
ఇవీ చదవండి: