Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్ దంతెవాడలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గోండెరాస్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 5.30 గంటలకు జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సల్స్ హతమయ్యారు.
కాల్పుల తర్వాత జరిగిన తనిఖీల్లో వీరిద్దరి మృతదేహాలు లభించాయని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. మరణించిన ఇద్దరు మహిళా నక్సల్స్‌పై ఉమ్మడిగా రూ.6 లక్షల రివార్డు ఉందని తెలిపారు.
డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బృందాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేస్తుండగా.. మావోలు తారసపడ్డారని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. మృతిచెందిన మహిళా నక్సల్స్‌ను హిద్మె కొహ్రామే, పొజ్జేలుగా గుర్తించారు.
క్రియాశీలంగా..
హిద్మెపై రూ.5 లక్షలు, పొజ్జేపై రూ. లక్ష రివార్డు ఉందని అధికారులు వివరించారు. మలాంగర్ ప్రాంత మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలిగా హిద్మె క్రియాశీలంగా పనిచేశారని తెలిపారు. మరోవైపు, చేత్నా నాట్య మండలి (మావోయిస్టుల సాంస్కృతిక శాఖ) ఇంఛార్జిగా పొజ్జే పనిచేశారని వెల్లడించారు.
స్థానికంగా తయారు చేసిన రైఫిళ్లు, మందుగుండు, సమాచార పరికరాలు, పేలుడు పదార్థాలను ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
'ఆ ఆరుగురిని చంపేస్తాం'
మరోవైపు, ప్రజా ప్రతినిధులను చంపుతామంటూ కువకొండ బ్లాక్‌లోని ఫుల్పాడ్ గ్రామంలో నక్సలైట్లు కరపత్రాలు విసిరేశారు. సర్పంచ్ కార్యదర్శులను, పోలీసులకు సహకరించిన గ్రామస్థులు సహా ఆరుగురిని చంపేస్తామని హెచ్చరించారు. బాణసంచా కాల్చి గ్రామస్థులను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నించారు.
ఇదీ చదవండి:అఖిలేశ్ యాదవ్ సన్నిహితుల నివాసాలపై ఐటీ దాడులు