Chhattisgarh Election 2023 :నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. తొలి విడతలో 20 నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. 20 సీట్లలో 12 స్థానాలు బస్తర్ డివిజన్‌కు చెందినవే ఉన్నాయి. సమస్యాత్మకమైన ఈ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. మిగిలిన స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ సాగనుంది. రెండో విడత ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి.
Election In Chhattisgarh 2023 :ఎన్నికల్లో 223 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 25 మంది మహిళలు ఉన్నారు. 40,78,681 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో 20,84,675 మంది మహిళలు కాగా, 19,93,937 మంది పురుషులు ఉన్నారు. 69 మంది ట్రాన్స్జెండర్లు సైతం ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఎక్కువ మంది పోటీలో ఉన్న నియోజకవర్గం రాజనందగావ్ (29 మంది అభ్యర్థులు) కాగా.. తక్కువ మంది పోటీలో ఉన్న స్థానాలుగా చిత్రకూట్, దంతేవాడ (ఏడుగురు చొప్పున) నిలిచాయి.
కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కీలక వ్యక్తులు
- ఎంపీ దీపక్ బైజ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు (చిత్రకూట్)
- మంత్రులు కవసి లఖ్మా (కోంటా) మోహన్ మార్కమ్(కొండగావ్), మహ్మద్ అక్బర్(కవర్దా),
- కాంగ్రెస్ నేత ఛవింద్ర కర్మ(దంతేవాడ)
బీజేపీ నుంచి బరిలో ఉన్న కీలక నేతలు
- మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్(రాజనందగావ్)
- మాజీ మంత్రులు కేదార్ కశ్యప్(నారాయణ్‌పుర్), లతా ఉసేంది (కొండగావ్), విక్రమ్ ఉసేంది(అంతగఢ్), మహేశ్ గడ్గ(బీజాపుర్)
- మాజీ ఐఏఎస్ అధికారి నీల్కాంత్ తెకం(కేశ్కాల్)
60 మందితో భద్రత..
Bastar Chhattisgarh Election :నక్సలిస్టుల ప్రభావం అదికంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 60 వేల మంది బలగాలను రంగంలోకి దించారు. అందులో 40 వేల మంది కేంద్ర బలగాలు కాగా.. 20వేల మంది రాష్ట్ర పోలీసులు భద్రత ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు. యాంటీ నక్సల్ యూనిట్ అయిన కోబ్రా దళాలు, మహిళా కమాండోలను రంగంలోకి దించారు.