ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది పోలీసులు కాగా ఒకరు డ్రైవర్. దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బుధవారం ఉదయం డిస్ట్రిక్ రిజర్వ్‌గార్డ్( DRG) పోలీసులు.. ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా.. అరణ్పుర్ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సీఎం బగేల్కు షా ఫోన్
మావోయిస్టుల దాడిని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బగేల్ ధ్రువీకరించారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నక్సలైట్లతో పోరు తుది దశకు చేరుకుందని, వారిని విడిచి పెట్టబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దాడి సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్కు ఫోన్ చేసి మాట్లాడారు. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. నక్సల్‌దాడిని ఖండించిన ప్రధాని మోదీ.. అమర జవానుల త్యాగాలు వృథా కాబోవని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
అనేక మంది జవాన్లు వీరమరణం
ఛత్తీస్గఢ్లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు జరుగుతుంటాయి. 2021 ఏప్రిల్లో భద్రతా దళాలు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో సుమారు 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన బీజాపుర్, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగింది. అంతకుముందు 2018 మార్చిలో 9 మంది సీఆర్పీఎఫ్ బలగాలు, ఫిబ్రవరిలో ఇద్దరు, 2017 ఏప్రిల్లో 24 మంది మరణించారు.