ఛత్తీస్గఢ్ భాజపా ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణమూర్తి బాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానానికి బదులుగా గంజాయి, భాంగ్ను ప్రత్యామ్నాయంగా తీసుకుంటే.. అత్యాచారం, హత్య, దోపిడీలు జరగకుండా ఉంటాయన్నారు. శనివారం మార్వాహి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ సైకో ట్రాపిక్ చట్టం ప్రకారం గంజాయి అమ్మకం, సేవించడం నేరమని.. కానీ గంజాయి మొక్కల పెంపకానికి అనుమతి ఉందని న్యాయనిపుణులు తెలిపారు.
"ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో ఒకసారి అసెంబ్లీలో కూడా చర్చించాను. అత్యాచారం, హత్యలకు మద్యం కారణమని పలుమార్లు చెప్పాను. గంజాయి తాగిన వ్యక్తి ఎప్పుడైనా రేప్, హత్యకు పాల్పడ్డారా? మద్యపాన నిషేధంపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. గంజాయి, భాంగ్ వినియోగం దిశగా కమిటీ ఆలోచించాలి. ఒకవేళ ప్రజలు మత్తును కోరుకుంటే హత్య, రేప్ జరగడానికి అవకాశం లేని వీటిని ఇవ్వాలి."
-- డా.కృష్ణమూర్తి బాంధీ, భాజపా ఎమ్మెల్యే