Collector's daughter in govt school: ప్రభుత్వ పాఠశాల పేరు వినగానే ఇప్పట్లో చాలామందికి శిథిలావస్థలో ఉన్న భవనం, పాతకాలం కుర్చీలో కూర్చొని కాలక్షేపం చేస్తున్న ఉపాధ్యాయుడి చిత్రాలు గుర్తుకువస్తాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా ప్రభుత్వ పాఠశాల చూస్తే కాలంతో పాటు పరిస్థితులు మారుతున్నాయని అనకుండా ఉండలేము. ఆ జిల్లా కలెక్టర్ కూడా తన కుమార్తెను ఈ పాఠశాలలోనే చేర్పించడం విశేషం.
జిల్లాలోని స్వామి ఆత్మానంద్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాల.. ప్రైవేటుకు దీటుగా అధునాతన సదుపాయాలను కలిగి ఉంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, బోర్డులు, మంచి టీచర్లకు తోడు ఆకర్షణీయమైన పాఠశాల వాతావరణం చదువుకోవడానికి అనుకూలంగా ఉంది.
"ఈ పాఠశాలలో బోధన బాగుంటుంది. జిల్లాలో ఆంగ్ల మాధ్యమంలో ఈ పాఠశాల ఉత్తమమైనది. అందుకే నా బిడ్డను ఈ స్కూల్లో చేర్పించాను."
- సంజీవ్ కుమార్ ఝా, కలెక్టర్
మంచి నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా ఇక్కడి విద్యార్థులు గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలు కనబరుస్తున్నారు.