Chandrayaan 3 Rover Update : చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా మూడు లక్ష్యాల్లో రెండు సాధించినట్లు ఇస్రో తెలిపింది. మూడోదైన మట్టి, రాళ్లలోని రసాయనాల కూర్పు, ఖనిజాలపై అన్వేషణ కొనసాగుతోందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడం, ఉపరితలంపైకి ప్రగ్యాన్ రోవర్ చేరుకోవడం, రోవర్ ద్వారా పరిశోధన చేయడం వంటి మూడు లక్ష్యాలను ఇస్రో పెట్టుకుంది. ఇందులో రెండు లక్ష్యాలు ఇప్పటికే సాధించగా ఇప్పుడు మూడో లక్ష్యసాధన దిశగా రోవర్ ప్రగ్యాన్ పనిచేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. రోవర్ తాను కనుగొన్న విషయాలను ల్యాండర్‌కు చేరవేస్తుంది. రోవర్ ప్రగ్యాన్ చేరవేసిన విషయాలను ల్యాండర్ తిరిగి భూమికి పంపిస్తుంది.
రోవర్ మరో వీడియో విడుదల చేసిన ఇస్రో..
Isro Video of Pragyan Rover :చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3లోని ప్రగ్యాన్ రోవర్.. ప్రయాణిస్తున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది.విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ దిగుతున్న వీడియోను ఇప్పటికే విడుదల చేసిన ఇస్రో.. తాజాగా ఈ కొత్త వీడియోను పోస్టు చేసింది. ఇందులో బంగారు రంగులో ప్రగ్యాన్ చంద్రుని మట్టిపై నెమ్మదిగా కదిలింది. ఆ తర్వాత ఉన్నచోటే ఒంపు తిరగడం స్పష్టంగా కనిపిస్తోంది. రోవర్ వెళ్లినంత దూరం దాని చక్రాల అచ్చు.. జాబిల్లి ఉపరితలంపై పడటం వీడియోలో గమనించవచ్చు. రోవర్‌కు సౌరశక్తిని ఇచ్చేందుకు అమర్చిన సోలార్ ప్లేట్లు కూడా కనిపిస్తున్నాయి. ల్యాండర్ ఇమేజర్ కెమెరా నుంచి ఈ వీడియోను విక్రమ్ తీసింది.