Chandrayaan 3 Rover Accident :చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ఇస్రో పంపిన ప్రజ్ఞాన్ రోవర్‌కు ఆదివారం ప్రమాదం తప్పింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు నెమ్మదిగా కదులుతున్న ప్రజ్ఞాన్ రోవర్‌కు మార్గ మధ్యలో 4 మీటర్ల వ్యాసం కలిగిన బిలం ఎదురైంది. ఆ రంధ్రం మూడు మీటర్ల దూరంలో ఉండగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. వెంటనే రోవర్ తన మార్గాన్ని మార్చుకుంది. ఇప్పుడు కొత్త మార్గంలో ప్రజ్ఞాన్ రోవర్ సురక్షితంగా ప్రయాణిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇస్రో పోస్ట్ చేసింది. రోవర్‌లో ఉన్న నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది.
Chandrayaan 3 Rover Updates :చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన సుమారు నాలుగు గంటల తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ అందులోంచి బయటకు వచ్చింది. శివశక్తి పాయింట్ పరిసర ప్రాంతాల్లో రోవర్ చక్కర్లు కొడుతూ పరిశోధనలు నిర్వహిస్తోంది. రోవర్‌లో కృత్రిమ మేధ ఉంది. ఇది రాళ్లను అలవోకగా దాటేయగలదు. లేజర్లు ప్రయోగించి, చంద్రుడిపై ఉన్న పదార్థాలను విశ్లేషించగలదు. ఇంత సామర్థ్యం ఉన్నప్పటికీ ఇది బుడిబుడి అడుగులు మాత్రమే వేస్తుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి గరిష్ఠంగా అర కిలోమీటరు మాత్రమే రోవర్ వెళ్లగలదు. ఎందుకంటే దీనికి సొంతంగా భూ కేంద్రంతో కమ్యూనికేషన్లు సాగించే సామర్థ్యం లేదు. ల్యాండర్ ద్వారానే అవి సాగాలి. అందువల్ల ప్రజ్ఞాన్ ఎప్పుడూ ల్యాండర్‌కు దగ్గర్లో ఉండాలి.