Chandrayaan 3 Latest Update :భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి గాలిలోకి లేచి కిందపడింది. ఈ క్రమంలోనే విక్రమ్ ల్యాండర్ దిగిన చోట 108.4 మీటర్ల విస్తీర్ణంలో పేరుకుపోయిన మట్టిని చెల్లాచెదురు అయినట్లు వివరించింది ఇస్రో. ఈ సమయంలో ఎజెక్టా హలో అనే అద్భుత దృశ్యం సైతం ఆవిష్కృతమైందని చెప్పింది. థ్రస్టర్ల డీసెంట్ ల్యాండింగ్‌తో పాటు ఆ తర్వాతి ప్రక్రియ సమయంలో ఇలా జరిగిందని వివరించింది. ఆర్బిటార్ హై రిజల్యూషన్ కెమెరా సహాయంతో ల్యాండింగ్‌కు ముందు, తర్వాత అక్కడి పరిస్థితిని విశ్లేషించామని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలను ప్రకటించింది ఇస్రో.
Chandrayaan 3 Landing Date : భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువం సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో దక్షిణ ధ్రువం వద్ద దిగిన తొలి దేశంగా భారత్ కీర్తి పతాకాల్లో నిలిచింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. చంద్రుడిపై సల్ఫర్ ఆనవాళ్లను గుర్తించింది ప్రజ్ఞాన్. చంద్రుడిపై ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. అనంతరం చంద్రుడిపై చీకటి కావడం వల్ల సెప్టెంబర్ 2న రోవర్, 4న ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితికి పంపారు. 14 రోజుల తర్వాత సెప్టెంబర్ 22న అక్కడ సూర్యోదయం కావడం వల్ల ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేసి మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కానీ అవి సఫలం కాలేదు. అయితే.. రోవర్ పని పూర్తైందని, అది మేల్కోకపోయినా నష్టం ఏమీ లేదని ఇస్రో స్పష్టం చేసింది.