Chandrababu Quash Petition:స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం - 1988లోని సెక్షన్ - 17Aలో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. లేదంటే దాని విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయన్నారు.
17A సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు, ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం. త్రివేది పేర్కొన్నారు. సెక్షన్-17A వర్తింపజేసే అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో, ఈ కేసును తదుపరి విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. రిమాండు ఉత్తర్వులు కొట్టేయడానికి ఇద్దరు న్యాయమూర్తుల నిరాకరించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ గత ఏడాది సెప్టెంబరు 9న కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు సెప్టెంబర్ 22న ఆ పిటిషన్ను కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఆ మరుసటి రోజు చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుదీర్ఘ విచారణ చేపట్టి గత ఏడాది అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసిన జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం మంగళవారం ఆ తీర్పును వెలువరించింది.
నిమ్మకూరులో ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతి - ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు
తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు వెలువరించారు. అవినీతి నిరోధక చట్టం - 1988లోని నేరాల కింద ప్రభుత్వ ఉద్యోగిపై నమోదు చేసిన కేసుల్లో విధి నిర్వహణలో భాగంగా సదరు వ్యక్తి తీసుకున్న నిర్ణయాలపై విచారణ, దర్యాప్తు చేపట్టేటప్పుడు సెక్షన్ 17-ఎ అమల్లోకి వచ్చిన తర్వాత అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ అలా తీసుకోకపోతే అవినీతి నిరోధక చట్టం -1988 కింద చేపట్టిన విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయని తేల్చిచెప్పారు.
ప్రస్తుత కేసులో అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోని కారణంగా చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(సి), 13(1)(డి) రెడ్ విత్ 13(2) కింద నమోదు చేసిన కేసుల తదుపరి విచారణ ప్రక్రియ కొనసాగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ ఇప్పుడైనా 17-ఎ కింద అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని సూచించారు. ఈ ఉత్తర్వులు దానికేమీ అడ్డంకి కావని స్పష్టం చేశారు. అందువల్ల ఆ సెక్షన్ ప్రకారం అనుమతి తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇప్పటికీ స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పుపై హైకోర్టు న్యాయవాదులు ఏమన్నారంటే ?
సెప్టెంబరు 10న దిగువ కోర్టు ఇచ్చిన రిమాండు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధబోస్ తెలిపారు. అవినీతి నిరోధక చట్టం-1988 కింద పేర్కొన్న నేరాలు ఆ దశలో వర్తింపజేయడానికి వీలు లేకపోయినా, రిమాండు ఉత్తర్వులు జారీచేసే న్యాయపరిధి దిగువ కోర్టుకు ఉందన్నారు. 17-ఎ కింద అనుమతి తీసుకోలేదని రిమాండు చెల్లదని చెప్పలేమన్నారు. ఇందులో ఐపీసీ-1860 కింద నమోదైన కేసుల విచారణను దిగువకోర్టు కొనసాగించవచ్చని పేర్కొంటూ, చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధబోస్ చెప్పారు.
జస్టిస్ అనిరుద్ధబోస్ అభిప్రాయాలతో జస్టిస్ బేలా ఎం. త్రివేది విభేదించారు. తన అభిప్రాయం ప్రకారం 17-A అన్నది అవినీతి నిరోధక చట్టం కింద సవరించిన, కొత్తగా చేర్చిన నేరాలకో వర్తిస్తుందని చెప్పారు. 2018లో ఈ చట్టానికి సవరణలు చేసినట్లు గుర్తుచేశారు. విస్తృత శాసన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2018లో ఓ సవరణ ద్వారా 17-Aని ప్రవేశపెట్టారని చెప్పారు. అది 2018 జులై 26 నుంచి అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. అందువల్ల ఆ సవరణ అంతకుముందు నుంచి వర్తించదన్నారు.