భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటిస్తూనే... పాకిస్థాన్‌ను వేరుచేసిన బ్రిటిష్ ప్రభుత్వం మరో కొర్రీ కూడా పెట్టింది. 563 సంస్థానాలు భారత్‌లో లేదా పాకిస్థాన్‌లో చేరొచ్చు... లేదంటే స్వతంత్రదేశాలుగా ఉండొచ్చు అని నిర్ణయించుకునే స్వేచ్ఛనిచ్చింది. ఈ సంస్థానాధీశులందరికీ సంఘంలాంటి 'ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్' ఉండేది. అందులో తర్జనభర్జనలు జరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లోని సంస్థానాలన్నీ కలసి భారత్, పాకిస్థాన్‌లతో కలవకుండా ఒక దేశంగా ఉందామని ప్రతిపాదించాడు భోపాల్ నవాబు హమీదుల్లాఖాన్. ఇంతలో పటేల్.. తన నమ్మకస్థుడైన సహచరుడు వీపీ మేనన్‌తో కలసి సంస్థానాధీశులందరినీ ఒప్పించే పనిలో పడ్డారు. చకచకా ఒక్కొక్కరిని కలవటం... ఒప్పించి విలీనపత్రంపై సంతకం చేయించటం యుద్ధప్రాతిపదికన సాగింది.
ఊగిసలాడిన జోధ్‌పుర్
హిందూ ప్రజలు, హిందూ రాజు చేతిలో ఉండి కూడా పాకిస్థాన్ వైపు చూసిన సంస్థానం జోధ్‌పుర్! పాకిస్థాన్‌తో సరిహద్దు ఉండటంతో పాటు కరాచీ రేవును, మిలిటరీని ఇస్తానన్న జిన్నా హామీతో జోధ్‌పుర్ మహారాజు హన్వంత్‌సింగ్ ఊగిసలాడారు. జైసల్మేర్ రాజుతో కలసి ముస్లింలీగ్ నేత జిన్నాను కలిశారు. పాకిస్థాన్‌లో కలిస్తే తమకేమిస్తారో చెప్పాలన్నారు. 'ఇదిగో తెల్లకాగితం. మీకేం కావాలంటే అది ఇస్తాను. రాసుకోండి. సంతకం పెడతాను' అంటూ హామీ ఇచ్చారు జిన్నా. కానీ హిందూ-ముస్లింల మధ్య గొడవల ప్రస్తావనతో... ఒప్పందం కాలేదు. జోధ్‌పుర్ మహారాజు పునరాలోచనలో పడ్డారు. ఈ విషయం తెలిసిన మేనన్... వెంటనే జోధ్‌పుర్ వెళ్లి భారత్‌లో చేరాల్సిందిగా రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఓ దశలో ఇద్దరిమధ్యా సంభాషణ ముదిరింది. బెదిరింపులకు లొంగేది లేదంటూ... జేబులోంచి పెన్‌తీసి మేనన్ నుదుటికి గురిపెట్టారు మహారాజు హన్వంత్‌సింగ్. అది పైకి పెన్నులా కన్పించే రహస్య గన్!
అదే సమయంలో వచ్చిన గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ పరిస్థితిని చల్లార్చి... ఆ పెన్-గన్‌ను మహారాజు నుంచి బలవంతపు బహుమతిగా తీసుకొని జేబులో పెట్టుకున్నారు. తర్వాత హన్వంత్‌సింగ్ భారత్‌లో విలీనంపై సంతకం చేశారు.