దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఆయా రాష్ట్రాలకు ఉన్నత స్థాయి వైద్య నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపిస్తోంది. దిల్లీలో కొద్దిరోజులుగా కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం దేశ రాజధాని పరిసర ప్రాంతాలు, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మణిపుర్‌పై పడిందని గుర్తించిన కేంద్రం అక్కడ కొవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర బృందాలను తరలించింది.
కరోనా నియంత్రణ, పరీక్షల పెంపు, నిఘా, నివారణ చర్యల బలోపేతంపై దృష్టి సారించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. మరిన్ని రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. కరోనా బాధితులను సకాలంలో గుర్తించి.. తగిన చికిత్స అందించేలా చూడాలని ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కరోనా కట్టడికి విస్తృతమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించింది.