కొవిడ్ నిరోధానికి భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' టీకాపై ఉన్న 'క్లినికల్ ట్రయల్ మోడ్' నిబంధన తొలగిపోనుంది. ఈ నిబంధన తొలగించాలని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన డీసీజీఐ, అదే సమయంలో భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాకు కూడా అత్యవసర వినియోగ అనుమతి ఇస్తూ, దాన్ని క్లినికల్ పరీక్షల్లో భాగంగా పరిగణించేలా 'క్లినికల్ ట్రయల్ మోడ్' అని స్పష్టం చేసింది.
దీనివల్ల కొవాగ్జిన్ టీకా తీసుకునే వారు ఆ మేరకు ఒక అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి వస్తోంది. ఈ వ్యాక్సిన్‌పై మూడోదశ క్లినికల్ పరీక్షల మధ్యంతర ఫలితాలను ఇటీవల భారత్ బయోటెక్ వెల్లడించింది. దీని ప్రకారం కొవాగ్జిన్ టీకాకు 81 శాతం ప్రభావశీలత ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో 'క్లినికల్ ట్రయల్ మోడ్' అనే నిబంధన తొలగించాల్సిందిగా కోరుతూ డీసీజీఐకి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసింది. దీనికి ఔషధ నియంత్రణ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నిబంధన తొలగిపోయిన తర్వాత కొవాగ్జిన్ వినియోగం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
స్పుత్నిక్ వి టీకాకు అనుమతిపై పరిశీలన