గత కొన్నిరోజులుగా దేశంలో పలు చోట్ల కొవిడ్ కేసులు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అధికంగా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వైరస్ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్‌పైనా దృష్టి పెట్టాలని తెలిపింది.
కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 8 నాటికి దేశంలో మొత్తం 2082 క్రియాశీల కేసులు ఉండగా.. తదుపరి వారంలోనే అవి 3264కు చేరుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించింది. కర్ణాటకలో కొవిడ్ పాజిటివిటీ రేటు 2.77గా ఉండగా, కేరళలో 2.64శాతం, తమిళనాడులో 1.99శాతం, మహారాష్ట్రలో 1.92శాతం, గుజరాత్‌లో 1.11శాతం, తెలంగాణలో 0.31శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ కట్డడి చర్యలు చేపట్టాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇన్‌ఫ్లుయెంజాతోపాటు కొవిడ్ ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని పేర్కొన్నారు.