Central Govt Focus on Krishna Water Share to AP and Telangana : తెలంగాణ ఆకాంక్షలు, డిమాండ్లపై కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం(Krishna Water Fight) పరిష్కరమయ్యేలా చర్యలు చేపట్టింది. కృష్ణా వివాదాల పరిష్కార ట్రైబ్యునల్-2 ద్వారా కృష్ణా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధివిధానాల ఖరారుకు కేంద్రమంత్రి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా తెలుగురాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయని కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్(Anurag Thakur) తెలిపారు.
Krishna Water Tribunal Board :కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ఏళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. 1976లో కృష్ణావాటర్ ట్రైబ్యునల్-1(Krishna Water Tribunal Board) మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో మధ్య నీటిని పంపిణి చేస్తూ అవార్డు ఇచ్చింది. ఇందులో భాగంగా 811టీఎంసీలు కేటాయింపులు చేస్తూ ఫైనల్ అవార్డు ఇచ్చింది. నీటివాటాల కేటాయింపులను పునః పరిశీలించవచ్చని ఆర్డర్‌లో తెలిపింది.
"కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్-2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం పరిష్కరించేలా నీటి పంపిణీ కోసం నూతన విధి విధానాల ఖరారుకు నిర్ణయం తీసుకున్నాం. ఈ ట్రైబ్యునల్ కృష్ణా నదీ జలాల్ని కేటాయించనుంది. రెండు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) ఇప్పటికే ఉన్న, నిర్మాణంలో ఉన్నవాటితో పాటు భవిష్యత్‌లో ప్రతిపాదించే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయనుంది. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాలన్న తెలంగాణ డిమాండ్ ఇవాళ నెరవేరింది." -అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
అనంతరం సభ్య రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు.. 2004లో కృష్ణావాటర్ డిస్పూట్ ట్రైబ్యునల్ -2 ఏర్పాటైంది. మార్చి 2011లో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నీటి వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టులో మహారాష్ట్ర, కర్ణాటకలపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 2013 నవంబర్ 29న నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్ నివేదిక అందించింది. దీనిపై ఏపీ సహా రాష్ట్రాల అభ్యంతరాలతో గెజిట్ ప్రచురణ కాలేదు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో..14 జూలై 2014న తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా నీటి పంపకాల విషయాన్ని తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఫిర్యాదు చేసింది.