వ్యవసాయ రంగానికి రాయితీపై ఇస్తున్న విద్యుత్తు భారాన్ని ఇకపై మోయాల్సిన అవసరం లేకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అయిదేళ్లలో దేశంలో వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లన్నింటినీ కుసుమ్ యోజన కింద సౌర విద్యుదీకరించి రాయితీ భారం లేకుండా చేయబోతోంది. దీనికి అవసరమయ్యే ఖర్చులో 30 శాతాన్ని కేంద్రం అందిస్తుంది. 70% మొత్తాన్ని నాబార్డు తదితర సంస్థలు రుణంగా అందిస్తాయి. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రూ.6.28 లక్షల కోట్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందులో రూ.3.03 లక్షల కోట్లతో విద్యుత్తు సంస్కరణల ప్రతిపాదనలు ఉన్నాయి.
సౌర విద్యుదీకరణ కోసం తీసుకునే 70% రుణాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్తు రాయితీ కోసం చేస్తున్న ఖర్చుతో 4-5 ఏళ్లలో చెల్లించేయొచ్చుననీ, ఆ తర్వాత రాయితీ భారం వాటికి ఉండదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ వెల్లడించారు. కేబినెట్ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం డబ్బులిస్తూనే ఉంటుంది.. డిస్కంలు నష్టాల్లో నడుస్తూనే ఉంటాయన్న విధానాన్ని అంగీకరించబోమని, వ్యవస్థను చక్కదిద్దుకోవడానికి ముందుకొచ్చే రాష్ట్రాలకు చేయూతనందించాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఆధునికతకు పెద్దపీట
వచ్చే అయిదేళ్లలో సరఫరా నష్టాలను 15% నుంచి 12%కి తగ్గించాలని, విద్యుత్తు సరఫరాకు, ఆదాయానికి మధ్య నష్టాన్ని సున్నాకి తీసుకురావాలని సింగ్ చెప్పారు. 'పూర్తి వ్యవస్థను ఆధునికీకరిస్తున్నాం. లోపాలు గుర్తించి సరిదిద్దే వ్యవస్థను మరో 100 పట్టణాల్లో ఏర్పాటుచేస్తాం. రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి ఇప్పటివరకు రూ.15వేల కోట్లు ఖర్చుచేసి 1.37 లక్షల కిలోమీటర్ల వ్యవసాయ ఫీడర్లు ఏర్పాటు చేశాం. మరో 1.25 లక్షల కిలోమీటర్ల వ్యవసాయ ఫీడర్లు నిర్మించాలని తాజా లక్ష్యంగా నిర్దేశించాం. కుసుమ్ పథకం కింద రైతుకు తొలిరోజు నుంచీ వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్తు లభిస్తుంది. పాత హెచ్‌టీ, ఎల్‌టీ లైన్లన్నీ మార్చేస్తాం. 2023 డిసెంబరు నాటికి 10 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తాం. స్మార్ట్ మీటరింగ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆ రోజు విద్యుదుత్పత్తి కోసం ఖర్చు ఎంత ఉంటే అంత టారిఫ్ అమలు చేస్తాం. వ్యవస్థను స్మార్ట్‌గా మార్చేందుకు కృత్రిమ మేధ (ఏఐ) తీసుకొస్తాం' అని వివరించారు.
రీఛార్జి చేసుకోవచ్చు