Center On China Pneumonia Detection : చైనాలో చిన్నారుల్లో న్యుమోనియా కేసులు పెరుగుతుండటాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆ దేశంలో ఆక్టోబరులో బయటపడిన ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాతో పాటు తాజాగా బయటపడుతున్న న్యుమోనియా కేసుల వల్ల భారతీయులకు తక్కువ ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, గత కొన్ని వారాలుగా చైనాలో శ్వాసకోశ సమస్యల కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది.
H9N2 వైరస్ కేసులపై చైనా అక్టోబరులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించిందని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర ఉన్న వివరాల ప్రకారం H9N2 వైరస్ వల్ల మరణాలు సంభవించే అవకాశం చాలా తక్కువని వివరించింది. కొవిడ్ అనంతరం వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని.. మౌలిక సదుపాయలను పెంచామని చెప్పింది. వన్ హెల్త్ అనే విధానంతో ముందుకు వెళ్తున్నామని తెలిపింది. వీటితో పాటు వ్యాధులను గుర్తించడానికి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొంది
WHO అప్రమత్తం
మరోవైపు చైనాలో చిన్నారుల్లో న్యుమోనియా కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. కేసులకు సంబంధించిన సమాచారం అందించాలని ఆ దేశాన్ని కోరినట్లు వెల్లడించింది. అలాగే, ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెప్పింది. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అక్కడి అధికారులను WHO కోరింది.