తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు షురూ.. ఆక్సిజన్ నిల్వలపై రాష్ట్రాలు అప్రమత్తం.. - కోవిడ్​పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ కొవిడ్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రతి విమానంలో రెండు శాతం ప్రయాణికులకు టెస్టులు నిర్వహిస్తున్నారు.

Random Testing For international travelers
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కోవిడ్​ పరీక్షలు

By

Published : Dec 24, 2022, 1:18 PM IST

Updated : Dec 24, 2022, 1:34 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతోన్న వేళ.. దేశంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రకటించిన విధంగా.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ కరోనా టెస్టులను ప్రారంభించింది. శనివారం ఉదయం దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ తదితర విమానాశ్రయాల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విమానాశ్రయాల అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విదేశాల నుంచి వచ్చే ప్రతి విమానంలో రెండు శాతం ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఎంపిక చేసిన ప్రయాణికులను విమానాశ్రయాల్లోని కొవిడ్‌ పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. ఈ పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలితే తదుపరి చర్యలకుగాను ఆ సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిస్తారు.

"ఈ పరీక్షలను పౌర విమానయాన శాఖ సమన్వయం చేయాలి. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకే ధరకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. ఖర్చులను కేంద్ర వైద్యారోగ్యశాఖ తిరిగి చెల్లిస్తుంది. ప్రయాణికుల్లో ఎవరికి టెస్టులు నిర్వహించాలన్నది సంబంధిత విమానయాన సంస్థలు గుర్తిస్తాయి" అని కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌.. పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సల్‌కు లేఖ రాశారు. ఈ మేరకు నేటినుంచి పరీక్షలు ప్రారంభించారు.

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
వైద్య ఆక్సిజన్‌ నిల్వలపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. విదేశాల్లో కొవిడ్ విజృంభణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. తగినంత ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఆక్సిజన్‌ సరఫరాలో జాగ్రత్తలు వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది.

పలుదేశాల ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు..
చైనా, జపాన్‌, దక్షిణకొరియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్​టీ పీసీఆర్​ పరీక్ష కూడా తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు. ఈ దేశాల నుంచి వచ్చినవారికి కరోనా లక్షణాలు ఉన్నా లేదా పాజిటివ్‌ వచ్చినా.. క్వారంటైన్‌కు తరలించనున్నట్లు చెప్పారు. అలాగే చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఆరోగ్య సువిధ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి.. అందులో వారు తమ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాల్సి ఉంటుందన్నారు.

Last Updated : Dec 24, 2022, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details