Bipin Rawat last speech: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం విడుదల చేసింది. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా దిల్లీలోని నిర్వహించిన 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' కార్యక్రమంలో జనరల్ రావత్ చివరి వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ వీడియో ద్వారా.. ఆ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు రావత్. 1971 ఇండియా-పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం దిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని తొలుత ఘనంగా నిర్వహించాలని భావించినా.. దేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అకాల మరణంతో నిరాడంబరంగా జరుపుతున్నట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రావత్‌ను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
"1971 ఇండో-పాక్ యుద్ధం 'స్వర్ణ విజయ సంవత్సరం' కింద నిర్వహించిన 'విజయ్ పర్వ్' జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ వేడుక దక్షిణాసియా చరిత్ర, భౌగోళిక స్థితిని మార్చిన భారత సైన్యం అద్భుతమైన విజయాన్ని గుర్తు. ఆ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడి ధైర్యానికి, పరాక్రమానికి, త్యాగానికి నమస్కరిస్తున్నాను. ఆ ధైర్యవంతులందరి త్యాగానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ యుద్ధం మన నైతికతకు, మన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, న్యాయంగా వ్యవహరించడానికి అద్భుతమైన ఉదాహరణ. యుద్ధంలో మరొక దేశాన్ని ఓడించిన తర్వాత.. మనలాంటి దేశం దానిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. ఆ అధికారాన్ని దానికే అప్పగించింది. ఇది చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుంది."