ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సమాధానంపై టీడీపీ ఆగ్రహం CBN Fired on State Election Commission: ఓట్ల అవకతవతలపై తాము చేసిన ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందని తెలుగుదేశం పేర్కొంది. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలు సరిదిద్దాలంటూ తామిచ్చిన ఫిర్యాదులోని అంశాలన్నింటినీ పరిష్కరించేసినట్లు చెప్పడాన్ని తప్పుబట్టింది. చంద్రబాబుకు సీఈఓ రాసిన లేఖపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని, వారంతా వైఎస్సార్సీపీ తరఫున 'జగనే ఎందుకు కావాలనే' పేరుతో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఫిర్యాదు చేసినా దానిపై ఎలాంటి చర్యలూ లేవని తెలుగుదేశం తెలిపింది. ఒకే జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు, పోలీసులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలనే ఆదేశాలున్నా చాలా చోట్ల అదే జిల్లాల్లోనే పోస్టింగులిస్తున్నా సీఈవో మాత్రం స్పందించట్లేదని విమర్శించింది.
ఓట్ల జాబితాలో అక్రమాలు- పట్టించుకోండి మహా ప్రభో!
ప్రతిపక్షాల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్ల తొలగింపు తప్పుడు సమాచారంతో ఫాం-7లు, నకిలీ ఓట్ల చేర్పింపు కోసం ఫాం-6లు దరఖాస్తు చేసిన వారిపై ఎన్నికల సంఘం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించింది. మొక్కుబడిగా ఒకటి రెండు చోట్ల కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకోవటాన్ని తప్పుబట్టింది. ఏ ఒక్కర్నీ అరెస్టు చేయలేదన్నా దానికి చంద్రగిరి, పర్చూరు, ఉరవకొండ ఘటనలే ఉదాహరణగా పేర్కొంది.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే తరహాలో తప్పుడు సమాచారంతో ఫాం-7లు పెట్టటంపై అప్పట్లో 425 కేసులు నమోదయ్యాయని వివరించింది. వాటిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తు చేసింది. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తుంటే సీఈవో కార్యాలయం నుంచి పర్యవేక్షణే లేదంటూ తప్పుబట్టింది.
''ఈనాడు-ఈటీవీ'' ఆధ్వర్యంలో ఓటరు నమోదు చైతన్య అవగాహనా సదస్సు
మూడు నెలల పాటు ఇంటింటి సర్వే చేసిన తర్వాత కూడా లక్షల సంఖ్యలో మృతుల పేర్లు, డూప్లికేట్ పేర్లతో ముసాయిదా జాబితా విడుదల చేయటం జిల్లా ఎన్నికల అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని విమర్శించింది. అయినా బాధ్యులైన ఏ ఒక్కరిపైనా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఓటర్ల జాబితాల పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు మొక్కుబడిగా పర్యటనలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసినా సీఈవో పట్టించుకోలేదని ఆరోపించింది.
మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందనలేదని పేర్కొంది. కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఈనాడు వంటి సంస్థలు చేస్తున్న కృషిని సీఈవో చేయకపోవడాన్ని తప్పుబట్టింది.
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఐఏఎస్ అధికారులపై టీడీపీ నేతల ఫిర్యాదు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తిరుపతి నియోజకవర్గం పరిధిలో వందల మంది నిరక్షరాస్యులను పట్టభద్ర ఓటర్లుగా చేర్చారంటూ ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేవలం ముగ్గురిపై మాత్రమే కేసు నమోదు చేసి మమ అనిపించారని విమర్శించింది. కనీసం వారిని అరెస్టై చేయకపోవడాన్ని తప్పుబట్టింది. వారికి సహకరించిన అధికారులపైనా ఎలాంటి చర్యలూ లేవని మండిపడింది.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా బోగస్ ఓటరు కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి ఇతర నియోజకవర్గాల వ్యక్తులను తీసుకొచ్చి ఓట్లు వేయించారంటూ చంద్రబాబు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ లేవని ఆరోపించింది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ఏ సమాచారమూ సీఈవో వెబ్‌సైట్‌లో లేకపోవడాన్ని తప్పుబట్టింది.
రాష్ట్రంలోని 175 మంది ఈఆర్‌వోలు, 26 మంది జిల్లా ఎన్నికల అధికారులు ఏ ఒక్క చోట క్షేత్ర పరిశీలన, పనితీరు మదింపు చేయకుండా వైఎస్సార్సీపీ నాయకులకు తలొగ్గుతున్నారని ధ్వజమెత్తింది. ఒకే కుటుంబంలోని అందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాల్సి ఉన్నా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ అలాంటి పరిస్థితి లేదని ఆక్షేపించింది. చంద్రగిరి నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాలకు చెందిన ఓటర్లను చేర్పిస్తుంటే ఎవరిపైనా చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పర్చూరులో ఒకే వ్యక్తికి మరో చోట ఓటు - బీఎల్వోలతో ఎన్నికల సంఘం విచారణ