రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గహ్లోత్ ఇల్లు, వ్యాపార సముదాయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఓ ఫర్టిలైజర్ కుంభకోణంపై తాజాగా కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. జోధ్‌పుర్‌లోని అగ్రసేన్ గహ్లోత్ నివాసానికి శుక్రవారం ఉదయం చేసుకున్న సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అగ్రసేన్ ఒక ఫర్టిలైజర్ వ్యాపారి. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టిన తరుణంలోనే అశోక్ గహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 2007 నుంచి 2009 వరకు పొటాష్‌ను భారీగా విదేశాలకు తరలించినట్లు అగ్రసేన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎరువులు రైతులకు రాయితీపై ఇచ్చేవని, వాటిని అక్రమ మార్గంలో విదేశాలు ఎగుమతి చేసినట్లు సీబీఐ అధికారవర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న వారికి సంబంధించిన గుజరాత్, రాజస్థాన్, బంగాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇండియా పొటాష్ లిమిటెడ్‌కు అధికారిక డీలర్‌గా వ్యవహరించిన అగ్రసేన్ గహ్లోత్ సహా ఇతరులపై అవినీతి కేసు నమోదు చేసిన అనంతరం ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. 2020లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అగ్రసేన్ నివాసంలో తనిఖీలు నిర్వహించింది.