Karti Chidambaram CBI: మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరో కేసు నమోదు చేసింది. 2010-14 మధ్య కాలంలో లావాదేవీలు, విదేశీ డబ్బు పంపిన ఆరోపణలకు సంబంధించి కార్తీపై కొత్త కేసు నమోదు చేసిన సీబీఐ ముంబయి, దిల్లీ తమిళనాడు సహా పలు ప్రాంతాలు కలిపి మొత్తం 9 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. చెన్నై, దిల్లీలోని చిదంబరం ఇంటిపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. చిదంబరం ఇంటి వద్ద ఉదయం 8 గంటల నుంచే సోదాలు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్నీ ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నాయి. సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన 250 మందికి వీసా ఇప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కార్తీ. చెన్నైలో 3, కర్ణాటకలో 1, ముంబయిలో 3, పంజాబ్లో 1, ఒడిశాలో 1 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలపై స్పందించిన కార్తీ చిదంబరం.. "నేను లెక్క మర్చిపోయాను. ఇప్పటివరకు ఇలా ఎన్ని సోదాలు నిర్వహించారు? దానిపై ఏదో ఒక రికార్డు ఉండే ఉంటుంది" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కార్తీ చిదంబరంపై ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ క్లియరెన్స్ ఇప్పించిన కేసులో విచారణ కొనసాగుతోంది.