బంగాల్ బొగ్గు కుంభకోణం కేసు విచారణను వేగవంతం చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ, ఆమె సోదరి మేనకా గంభీర్‌కు ఆదివారమే నోటీసులు పంపిన అధికారులు.. సోమవారం మేనక నివాసానికి వెళ్లారు. ఇద్దరు మహిళా అధికారుల బృందం ఆమెను ప్రశ్నించింది.
అంతకుముందు బొగ్గు చౌర్యం కేసుపై సీబీఐ బృందం తనను ప్రశ్నించవచ్చని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోల్‌కతాలోని హరీష్ ముఖర్జీ రోడ్డులో తన నివాసంలో అందుబాటులోని ఉంటానని మేనకా గంభీర్ చెప్పినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
టీఎంసీ మండిపాటు
అభిషేక్ బెనర్జీ భార్య, ఆమె సోదరికి సీబీఐ నోటీసులు పంపడాన్ని టీఎంసీ తప్పుబట్టింది. తమను భయభ్రాంతులకు గురి చేసేందుకు సీబీఐ, ఈడీని భాజపా వినియోగించుకుంటోందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. ఇలాంటి చర్యలకు తాము భయపడమని, న్యాయపరంగానే ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.
డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ బెనర్జీ.. బంగాల్ సీఎం మమతా బెనర్జీకి మేనల్లుడు. తన భార్యకు నోటీసులు పంపడంపై ఆయన కూడా ఆదివారం స్పందించారు. 'ఇలాంటి చర్యలతో తమను బెదిరించాలని వారు అనుకుంటే.. తప్పుగా ఆలోచించినట్లే. మేం తలవంచే రకం కాదు' అని బదులిచ్చారు.
కేసులో నిందితులు వీరే..
గతేడాది నవంబర్‌లో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. మాంఝీ అలియాస్ లాలా, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అమిత్ కుమార్ ధార్, కాజోర్ ఏరియా మేనేజర్ జయేశ్ చంద్ర రాయ్, ఈసీఎల్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ తన్మయ్ దాస్, కాజోర్ ఏరియా సెక్యూరిటీ ఇంఛార్జ్ దేబాషిశ్ ముఖర్జీని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. మాంఝీ లాలాపై.. అక్రమ మైనింగ్‌కు పాల్పడటం సహా, కునుస్టోరియా, కాజోరా ప్రాంతాల్లో ఈసీఎల్ లీజుకు తీసుకున్న మైన్ల నుంచి బొగ్గును చోరీ చేశారన్న అభియోగాలను మోపింది.
ఇదీ చూడండి: 'కేంద్రం సామాన్యుడిని లూటీ చేస్తోంది'