viveka murder case : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ తీరు మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తోంది. తాము అరెస్టు చేయాలని ఫిబ్రవరిలోనే నిర్ణయించామంటూ న్యాయస్థానానికి నివేదించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేకపోయింది. పైగా, అవినాష్ ముందస్తు బెయిల్ కోసం దఫదఫాలుగా చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అరెస్టును ఆపలేమంటూ సీబీఐని ఆదేశించలేమని సుప్రీం ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు స్పష్టం చేశాయి. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. అరెస్టు విషయంలో సీబీఐ ఎందుకో మీనమేషాలు లెక్కిస్తోంది.
విచారణకు రాకున్నా... ఏదైనా కేసులో దర్యాప్తు సంస్థ విచారణకు పిలిచినప్పుడు నిందితుడు వరుసగా రెండు, మూడుసార్లకు మించి గైర్హాజరైతే వెంటనే అరెస్టు చేస్తారు. అవినాష్ రెడ్డి మొదటి నుంచీ సహాయ నిరాకరణ చేస్తూనే ఉన్నా సీబీఐ చూసీచూడనట్లుగా వ్యవహరించింది. వారు పిలిచిన తేదీల్లో కాకుండా తాను అనుకున్నప్పుడే విచారణకు హాజరైన అవినాష్.. విచారణ అనంతరం బయటకొచ్చి సీబీఐ దర్యాప్తు తీరును తప్పుపడుతూ పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. అయినప్పటికీ ఎవరికీ లభించనన్ని మినహాయింపులు అవినాష్ కు సీబీఐ ఎందుకు ఇస్తోందన్న సందేహాలు సర్వత్రా ఆశ్చర్యపరుస్తున్నాయి.
అధికారం, రాజకీయ ప్రాబల్యం లేని సామాన్యుల పట్ల సీబీఐ ఇలాగే వ్యవహరిస్తుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొమ్ములు తిరిగిన నేరగాళ్లు, మహామహుల మెడలే వంచగలిగిన సీబీఐ.. తాను తలచుకుంటే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయటం పెద్ద పనేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. తాను అరెస్టు కాకుండా న్యాయపరమైన హక్కులన్నింటినీ అవినాష్ దాదాపు వినియోగించినా.. న్యాయస్థానాల నుంచి ఊరట లభించలేదు. అయినా సరే... ఆయనకు కావాల్సినంత సమయమిస్తూ అరెస్టు చేయకుండా సీబీఐ తాత్సారం ఎందుకు చేస్తోందన్నదే శేష ప్రశ్నగా మిగిలింది.