CBI on YS Bhaskar Reddy and Uday Kumar Reddy Custody Petitions: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో YS భాస్కరరెడ్డి, మరో నిందితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని 10రోజుల కస్టడీకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న సీబీఐ.. ఈ మేరకు హైదరాబాద్‌లోని కోర్టులో గట్టి వాదనలు వినిపించింది. వివేకాతో.. భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డికి రాజకీయంగా విభేదాలున్నాయని తెలిపింది. హత్య కుట్రలో వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలది కీలక పాత్రని, వారిద్దరూ దగ్గరుండి సాక్ష్యాలను చెరిపేయించడమేగాక, సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారని.. సీబీఐ వెల్లడించింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి.. భాస్కరరెడ్డితో పాటు శివశంకర్‌రెడ్డి కృషి చేశారన్న సీబీఐ.. దీనిపై వివేకా ఆగ్రహంతో ఉండేవారని పేర్కొన్నారు.
రాజకీయంగా... వివేకాను అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే కుట్ర జరిగిందని.. వివరించింది. ఈ సందర్భంగా అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాన్నీ ప్రస్తావించింది. వివేకా గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారని.. వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కట్టుకథ అల్లారని సీబీఐ తేల్చిచెప్పింది. వివేకా హత్య గురించి బాహ్యప్రపంచకం కన్నా ముందు ఉదయ్‌కు తెలుసని... ఆరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ఉదయ్... కాటన్, బ్యాండేజ్ ఏర్పాటు చేసి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న తండ్రి గజ్జల జయప్రకాశ్‌రెడ్డిని వివేకా ఇంటికి పిలిపించినట్లు.. సీబీఐ స్పష్టం చేసింది.
శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూచనల మేరకు జయప్రకాశ్‌రెడ్డి వివేకాకు కట్టు కట్టి గాయాలు కప్పిపెట్టారని తేలింది. మృతదేహాన్ని.. ఫ్రీజర్ బాక్సులో పెట్టి, పూలతో అలంకరించి.. గుండెపోటుతో చనిపోయినట్లు సందర్శకుల్ని ఉదయ్ నమ్మబలికినట్లు వెల్లడించారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి.. కీలక సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని,.. దర్యాప్తునకు సహకరించకపోగా ఎగవేత సమాధానాలు చెప్పారని... CBI కోర్టుకు తెలిపింది .