Cauvery Protest :కర్ణాటక ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాల విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతు, కన్నడ సంఘాలు చేపటిటన రాష్ట్ర బంద్‌తో సాధారణ జనజీవనం స్తంభించింది. బంద్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు కూడా పనిచేయట్లేదు. బంద్ ప్రభావం విమాన రాకపోకలపైనా పడింది. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బంద్ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఈ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
Cauvery Water Dispute : కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసన చేపట్టారు. మైసూరులో బస్టాండ్ ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కావేరీ జలాల విడుదలపై హుబ్బళ్లిలో నిరసనలు చేపట్టాయి. నీటి విడుదల ఆపాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బంద్ దృష్ట్యా అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు చోట్ల CRPF బలగాలను మోహరించారు. కేఆర్‌ఎస్ ఆనకట్ట, ప్రభుత్వ కార్యాలయాలు, పర్యటక, చారిత్రక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది.
Tamil Nadu Cauvery Protest :మరోవైపు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత తమిళనాడుకు వెళ్లే KSRTC బస్సులను ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం అర్ధరాత్రి వరకు నిలిపివేశారు. మరోవైపు కన్నడ సంఘాలకు వ్యతిరేకంగా తమిళనాడులోనూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.