Cash On Delivery Fake Orders :బెంగళూరులో ఆన్లైన్ మోసగాళ్ల గుట్టురట్టైంది. ఈ-కామర్స్ కంపెనీల నుంచి 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆర్డర్ల డేటాను దొంగిలించి.. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా నకిలీ వస్తువులను పంపుతున్న మోసగాళ్లను బెంగళూరు నార్త్ డివిజన్ సీఈఎన్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి, గుజరాత్, మధ్యప్రదేశ్‌కు చెందిన మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు. వీరు రెండేళ్లుగా దాదాపు రూ. 70 లక్షల దాకా మోసం చేశారని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఈ-కామర్స్ కంపెనీలు, షిప్పింగ్ కంపెనీల నుంచి డేటా దొంగిలించే వారు. ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లను (Cash On Delivery Orders) లక్ష్యంగా చేసుకునే వారు. ఇలా కొన్ని కొరియర్ సర్వీసులను వాడుకుని.. వినియోగదారులు ఆర్డర్ చేసిన తేదీ కన్నా.. ముందే వారి అడ్రస్‌కు నకిలీ వస్తువులు పంపించేవారు. అనంతరం డబ్బులు వసూలు చేసుకునే వారు. అయితే, అవి నకిలీ వస్తువులు అని గ్రహించిన వినియోగదారులు.. వాటిని ఈ-కామర్స్ కంపెనీలకు రిటర్న్ చేసేవారు. ఫలితంగా ఈ-కామర్స్ కంపెనీలు నష్టాలు చవిచూసేవి.
'సాధారణంగా ఈ-కామర్స్ కంపెనీలు వస్తువులను ఔట్‌సోర్స్ కంపెనీలకు (E Commerce Outsourcing Services) విక్రయిస్తాయి. ఆ కంపెనీల్లో పనిచేసే కొందరు వ్యక్తులు.. మోసగాళ్ల నుంచి డబ్బులు తీసుకుని డేటా విక్రయిస్తున్నారు. అయితే, ఆ కంపెనీలు ఎట్టిపరిస్థితుల్లోనూ డేటాను బహిర్గతం చేయకూడదని నిబంధన ఉంది. చాలా ఆర్డర్‌లలో వినియోగదారులు నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తారు. దీంతో ఎవరి నుంచి డబ్బులు తీసుకున్నా.. సమాచారం బయటకు రాకూడదనే ఉద్దేశంతో మోసగాళ్లు ఇలా చేసేవారు. కొన్నిసార్లు మోసగాళ్లు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి కూడా కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకునేవారు' అని బెంగళూరు నార్త్ డివిజన్ డీసీపీ శివప్రకాశ్ దేవరాజు తెలిపారు.