Cash For Query Case :తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాలోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణను బహిష్కరించారు విపక్ష ఎంపీలు. విచారణ జరుగుతున్న సమయంలోనే మహువా మొయిత్రా, ఇతర విపక్ష ఎంపీలు మధ్యలోనే వెళ్లిపోయారు. కొందరు కమిటీ సభ్యులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ.. వాకౌట్ చేశామని ఎంపీలు తెలిపారు. మహువాకు కమిటీ వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు వేసిందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. ఆమెకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీఎస్పీ ఎంపీ, దానిశ్ అలీ మద్దతు తెలిపారు.
'నీచమైన ప్రశ్నలు అడుగుతున్నారు'
అంతకుముందు వాకౌట్ చేస్తూ బయటకు వెళ్లిన ఎంపీ మహువా మొయిత్రా.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "అసలు అదేం మీటింగ్..? వారు నీచమైన ప్రశ్నలు వేశారు. వారు దేని గురించి అయినా ప్రశ్నిస్తున్నారు. నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నా కళ్లలో నీళ్లు మీకు కనిపిస్తున్నాయా?" అని బయటకు వెళ్తూ మహువా తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పక్కదారి పట్టించేందుకే బహిష్కరణ : ఛైర్మన్
మరోవైపు దీనిపై స్పందించిన ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోనాకర్.. ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే విచారణను బహిష్కరించారని ఎదురుదాడికి దిగారు. విపక్ష ఎంపీలు అనైతికంగా ప్రవర్తించారని అభిప్రాయపడ్డారు. విపక్ష సభ్యులు.. తనపై, కమిటీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న సమయంలో ఆమె ఏ మాత్రం సహకరించలేదన్నారు. 'ఈ విచారణకు మహువా సహకారం అందించలేదు. విపక్ష సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసేందుకే వారు ఆకస్మికంగా మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు' అని వినోద్ ఆరోపించారు. హీరానందనీ అఫిడవిట్‌పై ప్రశ్నలు అడిగితే.. మొయిత్రా ఆగ్రహాన్ని ప్రదర్శించారని కమిటీ సభ్యుడు అపరాజిత సారంగి తెలిపారు.