తనపై తానే కేసు నమోదు చేసుకున్నారు ఓ పోలీసు అధికారి. ఇదేంటీ నిందితులపై కదా కేసు నమోదు చేయాల్సింది అనుకుంటున్నారా! ఓ నిందితుడికి సహాయం చేస్తూ ఫిర్యాదు తీసుకోకపోవడం వల్ల ఆగ్రహించిన న్యాయస్థానం.. ఆ పోలీసుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లోని కోల్హూయి పోలీస్ స్టేషన్లో జరిగింది.
ఇదీ జరిగింది
కోల్హూయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బఢహర శివనాథ్ గ్రామానికి చెందిన సూర్య ప్రకాశ్ చౌదరి భార్య సీమా.. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉంది. అయితే, ఆ సంఘం అధ్యక్షురాలైన గ్రామ సర్పంచ్ మోహిత్ శర్మ భార్య షీలా దేవి రూ. 15,000 కాజేసింది. దీనిని గమనించిన సీమా.. వాటి లెక్కలు చూపాలంటూ షీలాదేవిని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన షీలాదేవి భర్త మోహిత్ యాదవ్.. ఏప్రిల్ 6న తన అనుచరులతో కలిసి అమె ఇంటిపై దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషించి చంపేస్తామంటూ బెదిరించారు.
వెంటనే సీమా భర్త సూర్య ప్రకాశ్ చౌదరి.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. పైగా అతడిని కొట్టి పోలీస్ స్టేషన్ నుంచి తరిమేశారు. పోలీసులు స్పందించకపోవడం వల్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు బాధితుడు. దీనిపై విచారించిన కోర్టు.. కోల్హూయి పోలీస్ స్టేషన్ అధికారి మహేంద్ర యాదవ్ సహా గ్రామ సర్పంచ్ మోహిత్ శర్మ, భార్య షీలా దేవితో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో తనతో పాటు మరో 14 మందిపై వివిధ సెక్షన కింద కేసు నమోదు చేశారు మహేంద్ర యాదవ్.