తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి - rtc bus falls into canal

marriage bus accident
కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు

By

Published : Jul 11, 2023, 6:12 AM IST

Updated : Jul 11, 2023, 10:53 PM IST

06:04 July 11

కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బృందం బస్సు, ఏడుగురు మృతి

ప్రకాశం జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బృందం బస్సు, ఏడుగురు మృతి

Bus Accident in Prakasam District: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి సాగర్​ కాల్వలో పడిపోవటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కొల్పోయారు. కాకినాడలోని వివాహ రిసెప్షన్‌కు హాజరుకావటానికి పొదిలి నుంచి బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది .

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సిరాజ్‌ అనే వ్యక్తి కుమార్తెకు కాకినాడకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. సిరాజ్‌ గ్రామంలో ఈ వివాహన్ని సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. నిఖా అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులు కార్లలో కాకినాడ వెళ్లిపోయారు. మంగళవారం వరుడి ఇంటి వద్ద రిసెప్షన్‌ నిర్వహించుకునేందుకు ముందుగానే నిశ్చయించుకున్నారు. రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు.. ఒంగోలు డిపోకి చెందిన ఆర్టీసీ ఇంద్ర బస్సును అద్దెకు తీసుకున్నారు.

వధూవరుల తల్లిదండ్రులు కార్లలో వెళ్లగా.. మిగిలిన కుటుంబసభ్యులు అర్ధరాత్రి కాకినాడకు బస్సులో బయల్దేరారు. పొదిలి నుంచి 20 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత బస్సు దర్శి పరసర ప్రాంతాలకు చేరుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సగానికి పైగా ప్రయాణికులు గాఢనిద్రలోకి జారుకున్నారు. దర్శి సమీపానికి చేరుకున్న తర్వాత.. బస్సు అదుపుతప్పి వంతెన మీద నుంచి సాగర్‌ కాల్వలో పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రమాదం జరిగిపోయింది.

బస్సు కాల్వలోకి పడిపోగానే అందులో ప్రయాణిస్తున్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. ఆందోళన నుంచి తేరుకుని చుట్టూ చూసేసరికి వారితో కలిసి ప్రయాణించిన వారిలో ఏడుగురు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో క్షతగాత్రుల రోధనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతులంతా పొదిలికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో అబ్దుల్ అజీస్ , అబ్దుల్ హాని , షేక్ రమిజ్ , ముల్లా నూర్జహాన్ , ముల్లా జానీ బేగం , షేక్‌ షాబినా , షేక్ హీనా అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మరో 18 మందికి గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను స్థానికులు క్రేన్‌ సాయంతో వెలికితీసి.. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రవాణా సంస్థ, రహదారులు భవనాలు, ఆర్టీసీ అధికారులతో దర్యాప్తు కమిటీని నియమించినట్లు ఆయన తెలిపారు.

పరిహారం ప్రకటన: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘోరరోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్టీసీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ఆర్టీసీ ఈడీ తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారి వైద్య ఖర్చులు భరిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి 50 వేల రూపాయలు ఆర్థికసాయం ప్రకటించినట్లు ఎమ్మెల్యే కుందుర్రు నాగార్జునరెడ్డి తెలిపారు.

Last Updated : Jul 11, 2023, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details