Brij Bhushan POSCO : లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై దిల్లీ కన్నౌట్ ప్యాలెస్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్లలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా అథ్లెట్లతో ఆయన దారుణంగా ప్రవర్తించాడని.. ఛాతీని తాకడం, అసభ్య పదజాలంతో సంభాషించేవాడని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనకు భయపడి మహిళా అథ్లెట్లు బృందాలుగానే బయటకు వచ్చేవారని తెలిసింది. బృందం నుంచి ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకర ప్రశ్నలు అడిగేవాడని ఎఫ్ఐఆర్లో మహిళా రెజ్లర్లు పేర్కొన్నారు. శ్వాసక్రియ పరీక్షిస్తానంటూ బ్రిజ్‌భూషణ్ తన దుస్తులను లాగాడని ఓ మహిళా రెజ్లర్ ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఛాతీని, పొట్టను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొంది.
Wrestlers protest reason : కోచ్ లేని సమయంలో భూషణ్ తమను వేధించేవాడని మరో బాధితురాలు ఆరోపించింది. కోచ్ పరీక్షించని పదార్థాలను తినమని చెప్పేవాడని తెలిపింది. ఓ అంతర్జాతీయ పోటీలో గాయపడినప్పుడు.. తనతో సన్నిహితంగా ఉంటే వైద్య ఖర్చులను ఫెడరేషన్ భరించేలా చేస్తానని బ్రిజ్ భూషణ్ అన్నట్లు మరో రెజ్లర్ ఆరోపించింది. ఫొటో తీసుకుందామంటూ తనను గట్టిగా కౌగిలించుకున్నాడని మరో రెజ్లర్ ఆవేదన వ్యక్తం చేసింది.
రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ వినోద్ తోమర్‌పైనా ఓ రెజ్లర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది. కాగా ఈ ఆరోపణలను బ్రిజ్‌భూషణ్ ఖండిస్తూనే ఉన్నారు. రెజ్లర్ల ఆరోపణలు నిజమని తేలితే తాను ఉరేసుకుంటానని తెలిపారు. మరోవైపు, బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై త్వరలో తుది నివేదక కోర్టులో సమర్పించేందుకు దిల్లీ పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది. కాగా కొన్ని నెలలుగా ప్రముఖ రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు మహిళా రెజ్లర్లతో పాటు ఓ మైనర్ చేసిన ఫిర్యాదుపై దిల్లీ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
బ్రిజ్ భూషణ్‌కు షాక్..
మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో బ్రిజ్ భూషణ్ తలపెట్టిన మహా ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి తిరస్కరించింది. జూన్ 5న ర్యాలీ జరగాల్సి ఉండగా.. అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అదే రోజు జిల్లాలో వివిధ కార్యక్రమాలు ఉన్నాయని అయోధ్య సర్కిల్ అధికారి ఎస్పీ గౌతమ్ తెలిపారు. అందుకే ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే, రెజ్లర్ల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తన ర్యాలీని కొద్దిరోజులు వాయిదా వేసుకుంటున్నట్లు బ్రిజ్ భూషణ్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.
రైతు సంఘాల నిరసన
రెజ్లర్లకు మద్దతుగా గురువారం రైతు సంఘాలు వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహించాయి. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఖాప్ మహాపంచాయత్ జరగ్గా.. పంజాబ్, హరియాణాలోని వివిధ ప్రాంతాల్లోనూ నిరసనలు జరిగాయి. శుక్రవారం కురుక్షేత్రలో మహాపంచాయత్ నిర్వహించనున్నారు. రెజ్లర్ల ఆందోళనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను సైతం కలుస్తామని రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్ తెలిపారు.