వలపు వల విసిరి అబ్బాయిలను మోసం చేసిన అమ్మాయిల గురించి విన్నాం. కానీ హరియాణా భల్లభగడ్కు చెందిన 31 ఏళ్ల అజయ్ కుమార్ మాత్రం ఓ యువతి ఇచ్చిన షాక్‌తో కంగుతిన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏడాది తర్వాత ఇంట్లో సామన్లు, నగదు, ఆభరణాలతో వెళ్లిపోయి తనను మోసం చేసిందని తెలిసి నమ్మలేకపోయాడు. తీరా ఆమె గురించి అసలు విషయం తెలిసి నివ్వెరపోయాడు.
కరోనా సమయం 2020 ఏప్రిల్‌లో అజయ్ కుమార్‌కు కాజల్ గుప్తా అనే అమ్మాయి ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది. ఇద్దరు నాలుగు నెలలపాటు రోజు చాట్ చేసుకుని దగ్గరయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి 2020 ఆగస్టు 7న దిల్లీలోని వినోద్ నగర్లో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే నివాసముంటున్నారు. పెళ్లయ్యాక ఇంట్లోకి ఖరీదైన సామాన్లు కొనివ్వమనేది కాజల్. ఆమె ఏది అడిగినా కాదనకుండా అజయ్ అన్నీ తీసుకొచ్చేవాడు. నగలు కూడా ఇప్పించాడు. ఇల్లు మారదామంటే కూడా ఒప్పుకున్నాడు. బ్యూటీ పార్లర్ పెట్టేందుకు డబ్బు కావాలని అడిగితే బ్యాంకులో లోను తీసుకుని మరీ రూ.లక్షలు సమకూర్చాడు. ఇలా ఏడాది గడిచాక ఓ రోజు కాజల్ ఇంట్లోని సామన్లు, నగలు, డబ్బుతో దొరికిన కాడికి దోచుకెళ్లింది. దీంతో షాక్‌కు గురైన అజయ్ ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె తనలాగే మరో ఆరుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిందని తెలిసి కంగుతిన్నాడు. ఒక ముఠాకు చెందిన వీరంతా పక్కా పథకంతో ఇలా డేటింగ్ యాప్‌లో మోసాలకు పాల్పడుతున్నట్లు గ్రహించి దిల్లీ, హరియాణా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే వాళ్లు అసలు పట్టించుకోలేదని అజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతను కోచింగ్ సెంటర్‌తో పాటు ప్రైవేటు డిటెక్టివ్గానూ పని చేస్తున్నాడు. అందుకే కొన్ని బలమైన ఆధారాలు సేకరించి పోలీసులకు ఇచ్చాడు. ఎట్టకేలకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి కాజల్ గుప్తా కోసం గాలింపు చేపట్టారు.