శ్మశాన వాటికల్లో మృతుల అంతిమసంస్కారాలను ఎక్కడైనా.. పురుషులే నిర్వహిస్తారు. కానీ, కేరళలో ఓ మహిళ ఈ సామాజిక కట్టుబాట్లను తెంచి, తానూ ఈ పుణ్య కార్యాన్ని నిర్వహించటంలో నిమగ్నమయ్యారు. త్రిస్సూర్ జిల్లాకు చెందిన సుబీనా అనే మహిళ.. శ్మశానవాటికలో మృతదేహాలను దహనం చేస్తున్నారు. లింగ వివక్షనే కాకుండా.. మతపరంగా ఉన్న అడ్డంకులనూ ఛేదించి ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
'నువ్వు మహిళవేనా? అన్నారు'
చాలా మంది ఈ వృత్తిని చిన్నచూపుతో చూస్తున్న తరుణంలో... సుబీనా మాత్రం గర్వంతో, అంకిత భావంతో పని చేస్తున్నారు. ముస్లిం మహిళ అయిన ఆమె ఈ పనిలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. చాలా మంది ఆమెను 'నువ్వు ముస్లింవేనా? మహిళవేనా?' అని సూటిపోటి ప్రశ్నలతో వేధించారు. అయితే.. ఇన్ని సవాళ్లెదురైనా ఆమె ఈ వృత్తి ఎంచుకోవడానికి ప్రధాన కారణం 'ఆకలి'.
ఓ చెట్టు కొమ్మ నరుకుతూ కింద పడగా సుబీనా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఐదు సార్లు సర్జరీ నిర్వహించారు. దాంతో సుబీనా కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. తన చెల్లెలి వివాహ బాధ్యతలు కూడా సుబీనా మీదే పడ్డాయి. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ.. సుబీనాకు అండగా ఆమె భర్త నిలుచున్నారు. తాను శ్మశానవాటికలో పని చేసేందుకు వెళ్తానన్నప్పుడు ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు.