Boy Saves Many lives :బంగాల్.. మల్దా జిల్లాలోని పదేళ్ల ఓ బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వందలాది ప్రాణాలు కాపాడాడు. పట్టాలపై వేగంగా దూసుకు వస్తున్న రైలును త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించాడు. దీంతో రైల్వే శాఖ సహా అందరి ప్రశంసలు అందుకుంటూ స్థానికంగా హీరో అయిపోయాడు.
ఇదీ జరిగింది
ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు హరిశ్చంద్రపుర్ రెండో బ్లాక్‌లోని మషల్దా గ్రామ పంచాయతీలోని కరియాలి గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తండ్రి పని కోసం వలస వెళ్లడం వల్ల.. తల్లి, సోదరి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న కుంటలో చేపలు పట్టడానికి వెళ్లాడు ముర్సెలీమ్. అతడు చేపలు పడుతున్న ప్రదేశానికి సమీపంలో రైలు పట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలో ముర్సెలీమ్ రైలు పట్టాల కింద పెద్ద గుంత ఉండటం గమనించాడు. ఈ ప్రాంతంలో ఇటీవల వర్షాలు పడటం వల్ల.. పట్టాల కింద కంకర కొట్టుకుపోయి గుంత పడినట్లు భావిస్తున్నారు.
అయితే అంతలోనే పట్టాలపై వందల మంది ప్రయాణికులతో కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకువస్తోంది. దీనిని గమనించి అప్రమత్తమైన ముర్సెలీమ్.. వేగంగా పట్టాల వద్దకు పరుగెత్తాడు. తన ఒంటిపై ఉన్న ఎర్ర టీషర్టు విప్పి లోకోపైలట్‌కు సిగ్నల్ ఇచ్చాడు. అలా టీషర్టు ఊపుతూ కొద్దరి సేపు నిలబడ్డాడు. ఇది గమనించిన లోకోపైలట్ అప్రమత్తమై.. రైలు నిలిపివేశాడు. అనంతరం ఇంజిన్ దిగి చూసి బాలుడిని అభినందించాడు. అనతంరం రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంధ్రాన్ని పూడ్చివేశారు. గంట తర్వాత రైలు యథావిథిగా బయలుదేరింది.