Borewell Boy died: మధ్యప్రదేశ్ ఉమరియా జిల్లాలో బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడిని అధికారులు రక్షించలేకపోయారు. 16 గంటలకుపైగా నిర్విరామంగా సహాయకచర్యలు చేపట్టినా.. ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు.
ఆడుకుంటూ బోరుబావిలో పడి..
జిల్లాలోని బడ్చడ్ గ్రామానికి చెందిన గౌరవ్ అనే బాలుడు గురువారం సాయంత్రం.. ఆడుకుంటూ పొలంలోకి వెళ్లాడు. అక్కడే అకస్మాత్తుగా బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముందుగా బోరులో ఉన్న చిన్నారికి ఆక్సిజన్‌ను అందించే ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మూడు నాలుగు జేసీబీలతో బోరుకు సమాంతరంగా తవ్వే పనులను ప్రారంభించారు.
అలా జరిగిందని తెలిసినా..!
బోరు బావిలో పడిన ఆ బాలుడు 8 నుంచి 10 గంటల తర్వాత చనిపోయినట్లు వైద్యులు భావించారు. అయితే ఏదోమూల చిన్న ఆశతో తీవ్ర ప్రయత్నాలు చేశారు సహాయక సిబ్బంది. దాదాపు 16 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు గౌరవ్‌ను బయటకు తీశారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధరించారు. నీటిలో మునిగిపోవడం వల్ల ఊపిరి ఆడక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇటువంటి ఘటనే గతేడాది ఛత్తర్పుర్ జిల్లా దౌనీ గ్రామంలో జరిగింది. ఓ ఏడాదిన్నర చిన్నారి బోరుబావిలో చిక్కుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సురక్షితంగా బయటకు తీశారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
ఇదీ చూడండి:'దేశ రక్షణకు సైబర్ భద్రతే కీలకం'