ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు బావిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. బావిలో డిప్యూటీ MRO కారు బోల్తా.. నలుగురు మృతి - ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో మరణించిన ఒడిశా వాసులు
పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ డిప్యూటీ తహసీల్దార్ కారు అదుపు తప్పి బావిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని ఉమర్‌కోట్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సపన్ సర్కార్, అతడి భార్య రీటా సర్కార్.. ఓ వివాహానికి ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌కు వెళ్లారు. వివాహం అయ్యాక మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి రాత్రి 10.30 గంటల సమయంలో బయలుదేరారు. అయితే బయలుదేరి చాలా సమయం అయిన ఇంటికి చేరకపోవడం వల్ల కుటుంబసభ్యులు భయపడ్డారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మొబైల్స్ స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. కుటుంబసభ్యులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. కాంకేర్ పరిసరాల్లో మొబైల్ లొకేషన్ ఆధారంగా బావిలో పడిన కారును గుర్తించారు. వెంటనే నలుగురి మృతదేహాలను వెలికితీశారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. రీటా సర్కార్ రూ.3 లక్షల విలువైన బంగారాన్ని ధరించినట్లు తెలుస్తోంది. వీళ్ల వద్ద సుమారు రూ.20 వేల నగదు కూడా ఉంది. అయితే ఇది నిజంగా రోడ్డు ప్రమాదమా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.