ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను చెక్ పెట్టేందుకు భాజపా(BJP) అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. కొందరు పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi adityanath)కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్టీలో విభేదాలు ఉంటే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. నేతల అభిప్రాయాలను పార్టీ స్వీకరిస్తుందని అధిష్ఠానం స్పష్టం చేసింది. అయితే, నేతల మధ్య విభేదాలు ప్రజల్లో పార్టీ ఇమేజ్ను దెబ్బతీయకూడదని తేల్చి చెప్పింది.
రంగంలోకి ప్రధాన కార్యదర్శి
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన ఈ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చి పట్టునిలుపుకోవాలని పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలో సమస్యలపై భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లఖ్నవూలో వివిధ నేతలతో చర్చిస్తున్నారు.
మంత్రులు, నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడమే కాకుండా.. వారి అసంతృప్తిని వెళ్లగక్కేందుకూ అవకాశం ఇచ్చారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ కట్టడి, ప్రజల్లో అసంతృప్తి, నేతలు- ప్రభుత్వం మధ్య సమన్వయం లేకపోవడం వంటి సమస్యలను వీరంతా పార్టీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.