సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ అంశాలపై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీ వీడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
"గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నేత. ద్రవ్యోల్బణం, విభజన రాజకీయాలు, పలు అంశాలపై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆయన పార్టీని వీడటం విచారకరం, దురదృష్టకరం" అని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే ఈ రాజీనామా లేఖలోని విషయాలను ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి వాస్తవం కాదన్నారు. రాజీనామా లేఖలో ఆజాద్.. రాహుల్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన రాకతో పార్టీ పతనం మొదలైందని మండిపడ్డారు. పరిణతి లేని ఆయన నాయకత్వంతోనే తాను పార్టీ నుంచి భారమైన హృదయంతో వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు.
వ్యక్తిగతంగానూ ఆజాద్‌పై పరుష వ్యాఖ్యలు చేశారు జైరాం రమేశ్. "పార్టీ నేతలందరూ ఆయనతో ఎంతో మర్యాదపూర్వకంగా ఉండేవారు. ఇలా పార్టీని వీడి వెన్నుపోటు పొడవటం వల్ల ఆయన నిజస్వరూపం బయటపడింది. జీఎన్ఏ(గులాం నబీ ఆజాద్) డీఎన్ఏ "మోడి-ఫై" అయింది" అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్.
కాంగ్రెస్‌కు ఇది మామూలు ఎదురుదెబ్బ కాదు..!
గులాం నబీ ఆజాద్ రాజీనామా సమర్పించడం.. కాంగ్రెస్‌కు మామూలు ఎదురుదెబ్బ కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. 'ఆయన పార్టీ వీడటం గురించి మొదట్లో పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు మామూలు ఎదురుదెబ్బ కాదు. ఇటీవల కాలంలో హస్తం పార్టీని వీడిన సీనియర్ నేత ఆయన. ఆయన రాజీనామా లేఖ చదవడం బాధగా అనిపించింది. భారతదేశంలోని పురాతన పార్టీలో ఈ పరిణామాలు భయానకంగా కనిపిస్తున్నాయి' అని అన్నారు అబ్దుల్లా.