భాజపా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవి కాలాన్ని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం పొడిగించింది. దిల్లీ వేదికగా జరిగిన భాజపా జాతీయ సంస్థాగత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. భాజపా జాతీయ అధ్యక్షుడిగా జెపీ నడ్డా పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించాలని పార్టీ కార్యవర్గం నిర్ణయించిందని అమిత్ షా తెలిపారు. జేపీ నడ్డా పదవి కాలం పొడగింపు నిర్ణయాన్ని.. పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆయన వెల్లడించారు.
వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా పదవీకాలం పొడగింపునకు ప్రాధాన్యమిచ్చినట్లు అమిత్‌షా తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మంచి విజయం సాధించిందన్నారు అమిత్‌షా. నరేంద్ర మోదీ, జేపీ నడ్డా నాయకత్వంలో 2024లోనూ అంతకంటే భారీ విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జేపీ నడ్డా సారథ్యంలో భాజపా దూసుకెళ్తోందని, 2024 ఎన్నికల్లోనూ మోదీనే ప్రధానిగా ఎన్నికవుతారని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. పార్టీకి నడ్డా చేసిన సేవలను అమిత్‌షా కొనియాడారు. కొవిడ్ సమయంలో పార్టీని సమన్వయం చేస్తూ, ప్రజలకు సేవ చేశారని నడ్డాను ఆయన అభినందించారు. నడ్డా నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని షా వెల్లడించారు.
2019 జూన్లో నడ్డా భాజపా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2020 జనవరిలో నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్ షా నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు అమిషాకు కూడా ఇదే తరహాలో పదవీకాలం పొడిగించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
ఉందిలే మంచి కాలం..
దేశంలో అత్యుత్తమ శకం రాబోతుందన్నారు మోదీ. మంగళవారం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలతో సంబంధం లేకుండా మైనారిటీలు సహా సమాజంలో ప్రతి వర్గాన్ని చేరుకోవాలని భాజపా సభ్యులకు పిలుపునిచ్చారు. "భాజపా రాజకీయ పార్టీ మాత్రమే కాదు. సామాజిక ఆర్థిక పరిస్థితులను మార్చే ఉద్యమం. 18-25 ఏళ్ల మధ్య వయస్సు గల వారు భారతదేశ రాజకీయ చరిత్రను చూడలేదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి వారికి తెలియదు. దీనిపై వారికి అవగాహన కల్పించాలి. భాజపా సుపరిపాలన గురించి వారందరికీ తెలియజేయాలి." అని భాజపా నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని.