తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్ అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్​పై కుర్చీ విసిరేందుకు యత్నం! - బిహార్ రాజకీయాలు

Bihar Assembly Monsoon Session : 'ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం' కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శాసనసభ బుధవారానికి వాయిదా పడింది.

bihar assembly monsoon session
bihar assembly monsoon session

By

Published : Jul 11, 2023, 3:18 PM IST

Updated : Jul 11, 2023, 4:14 PM IST

Bihar Assembly Monsoon Session : బిహార్​ అసెంబ్లీలో మంగళవారం తీవ్ర గందరగోళం నెలకొంది. 'ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం' కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​ ఛార్జిషీట్​ దాఖలైన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్​లోకి ప్రవేశించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల సమయంలో.. ఒక బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిపై కుర్చీ విసిరేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గందరగోళం నెలకొనడం వల్ల శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు స్పీకర్ అవధ్ బిహార్ చౌదరి.

మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసససభ.. ప్రతిపక్షాల నిరసనల మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్​ శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు. అలాగే శాసనమండలి కూడా బుధవారానికి వాయిదా పడింది. బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి.. మండిపడ్డారు. 'ఇటువంటి ప్రవర్తన ఖండించదగినది. ఎమ్మెల్యేల ప్రవర్తన ప్రజాస్వామ్యానికే మచ్చ.' అని అన్నారు.

మరోవైపు శాసనసభ బయట బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సరయోగి మీడియాతో మాట్లాడారు. తేజస్వీ యాదవ్​ తన పదవికి రాజీనామా చేయకపోతే.. బిహార్ సీఎం నీతీశ్ కుమార్​ అయినా తేజస్వీని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తేజస్వీ యాదవ్ పదవిలో నుంచి దిగిపోయేవరకు సభను సజావుగా సాగనివ్వమని హెచ్చరించారు. కేవలం తన సీఎం కుర్చీని కాపాడుకోవడం కోసమే నీతీశ్ కుమార్.. తేజస్వీ యాదవ్ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సరయోగి అన్నారు.

కేసు ఏంటంటే?
Land For Job Scam Case : 2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో 'గ్రూప్​-డీ' ఉద్యోగాల కోసం లాలూ, ఆయన కుటుంబ సభ్యులు అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆయన కుటుంబ సభ్యులు కొందరి దగ్గర భూమిని లంచంగా తీసుకున్నారని ఆరోపించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్​.. పట్నా జోన్​కు చెందిన కొందరికి కోల్​కతా, ముంబయి, జైపుర్, జబల్​పుర్ వంటి జోన్లలో రైల్వే ఉద్యోగాలు ఇప్పించారని ఛార్జి​షీట్​లో పేర్కొంది. ఇందుకు బదులుగా ఉద్యోగాల పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు.. వారి భూములను లాలూ ప్రసాద్​కు చెందిన కంపెనీలకు బదిలీ చేశారని సీబీఐ అభియోగ పత్రంలో వివరించింది. ఈ కేసులో ఇదివరకే లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి, మరికొందరిని నిందితులుగా పేర్కొంది. అయితే, ఇటీవల ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్​లో లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌నూ మొట్టమొదటిసారి నిందితుడిగా చేర్చింది.

Last Updated : Jul 11, 2023, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details