జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులు లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో బిహార్ భాజపా ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను అరుదైన డిమాండ్ చేశారు. కశ్మీర్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారందరికీ ఏకే-47లు ఇవ్వాలన్నారు. దీనివల్ల ఉగ్రవాదులతో వారు పోరాడగలరని అభిప్రాయపడ్డారు. శ్రీనగర్‌లో బిహార్‌కు చెందిన పానీపూరి వ్యాపారిని ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమన్నారు.
"కశ్మీర్లో నిరాయుధులు, పేదవాళ్లను చంపడం దారుణం. పాకిస్థాన్ ఉగ్రవాదుల సహకారంతోనే ఈ దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం భద్రతను మరింత పటిష్ఠం చేస్తే ప్రజలు ప్రశాంతంగా జీవించి వ్యాపారాలు చేసుకోగలరు. రాజ్యాంగ సవరణ చేసి కశ్మీర్‌లోని స్థానికేతరులకు ఏకే-47 లైసెన్సులు ఇవ్వాలి. వాళ్లకు ఆయుధాలు ఉచితంగా ఇస్తే ముష్కరులతో పోరాడగలరు."
- భాజపా ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను
కశ్మీర్లో తమ ప్రాంత ప్రజలపై దాడులు జరుగుతుండటంపై బిహారీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.