కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ నేతల విమర్శలు హద్దులు దాటుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ విషసర్పం లాంటివారని వ్యాఖ్యానించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్.. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియాను 'విషకన్య'తో పాల్చారు. దీంతో ఆయనన్ను బీజేపీ తమ పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బసనగౌడ ఏమన్నారంటే?
మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ స్పందించారు. "ప్రపంచం మొత్తం మోదీని అభినందిస్తోంది. అమెరికా ఆయనకు ఒకప్పుడు వీసా ఇవ్వలేదు. కానీ నేడు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికింది. ప్రపంచ నాయకులతో శభాష్ అనిపించుకునే నాయకుడిగా మోదీ ఎదిగారు" అంటూ యత్నాల్ బహిరంగ సభలో మాట్లాడారు. "ఆయనను (మోదీ) నాగుపాముతో పోల్చి విషపూరితం అంటున్నారు. మీరు మీ పార్టీలో ఉన్న సోనియా గాంధీ విషకన్య కాదా? దేశాన్ని నాశనం చేసిన సోనియా గాంధీ.. చైనా, పాకిస్థాన్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారు" అని యత్నాల్ ఆరోపించారు.
మండిపడ్డ కాంగ్రెస్.. యత్నాల్‌ను బహిష్కరించాలని డిమాండ్
అయితే సోనియాగాంధీపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనను బహిష్కరించాలని డిమాండ్ చేసింది. "అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజీపీ నాయకత్వం పూర్తిగా నిరాశకు గురైంది. అందుకే ప్రతిపక్షంపై బురద జల్లుతోంది. మోదీ సూచనలతో, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మద్దతుతో.. బీజేపీ నేత బసనగౌడ పాటిల్.. సోనియాగాంధీని విషకన్యగా పోల్చి అత్యల్ప స్థాయికి దిగజారారు" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు.
"బీజేపీ నాయకత్వం, మోదీ.. గాంధీ కుటుంబంపై బురద జల్లడమే వృత్తిగా మార్చుకున్నారు. గతంలో కూడా మోదీ.. సోనియాను జెర్సీ ఆవు అని అన్నారు. దేశం కోసం వీరమరణం పొందిన మాజీ ప్రధాని భార్య సోనియా గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. బీజేపీ నాయకత్వ లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది" అని సూర్జేవాలా విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎమ్యెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
'యథా రాజా తథా ప్రజా!'
సోనియాపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా స్పందించారు. అత్యంత గౌరవంగా జీవితాన్ని గడిపిన సోనియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అన్నారు. "మోదీ జీ.. మీరు ఈ మాటలను సమర్థిస్తారా? యథా రాజా తథా ప్రజా" అని ట్వీట్ చేశారు.
'మోదీ.. ఆ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?'
బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సమర్థిస్తారా అని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ప్రశ్నించారు. తక్షణమే ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
'ప్రపంచం మొత్తం మోదీని..'
మరోవైపు.. మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ప్రపంచమంతా ప్రధాని మోదీని స్వాగతిస్తోందని.. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనను విషసర్పం అన్నారని.. ఆ పార్టీ మైండ్ బ్లాక్ అయిందని షా ఆరోపించారు.
పోటాపోటీ ఫిర్యాదులు
ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మల్లిఖార్జున ఖర్గేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ సభ్యుల బృందం.. ECని కలిసి ఫిర్యాదు చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఖర్గే పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. మల్లిఖార్జున ఖర్గే యాదృచ్చికంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ విద్వేష రాజకీయాల్లో భాగంగానే విమర్శలు చేశారని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఆరోపించారు. ఖర్గే తరచూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని, మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని బీజేపీ నేతలు విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ సైతం బీజేపీ నేతలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని ఈసీని కోరింది. ప్రచారంలో పాల్గొన్న వీరు.. మైనార్టీలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసింది.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. బీజేపీ నుంచి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగనున్నారు. పోలింగ్‌కు ముందు కనీసం 6 రోజుల పాటు ప్రధాని మోదీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు మే 10 పోలింగ్ నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.