పంచాయతీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని బలవంతంగా అమర్చిన భాజపా సభ్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కోయంబత్తూర్లోని పులువపట్టి పంచాయతీ కార్యాలయంలో జరిగింది.
భాజపా అనుబంధ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శి భాస్కరన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల బృందం ఆదివారం కార్యాలయంలోకి వెళ్లింది. ప్రధాని మోదీ ఫొటో లేకుండా తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి చిత్రపటాన్ని పంచాయతీ కార్యాలయంలో పెట్టినందుకు నిర్వాహకులతో భాస్కరన్ వాగ్వాదానికి దిగారు. అయినా.. ప్రధాని మోదీ చిత్రపటాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో కరుణానిధి ఫొటో పక్కనే మోదీ చిత్రపటాన్ని బలవంతంగా అమర్చారు భాస్కరన్. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.